Telangana Congress : కుట్రదారులెవరు...? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?-who is conspiring against the senior leaders of telangana congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : కుట్రదారులెవరు...? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Telangana Congress : కుట్రదారులెవరు...? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Mahendra Maheshwaram HT Telugu
Jul 30, 2023 05:40 AM IST

TPCC Latest News: కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ తో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే పడిలో పడింది. కట్ చేస్తే.. తమపై పార్టీలోనే కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ సీనియర్ నేతలు వాపోవటం చర్చనీయాంశంగా మారింది.

టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Telangana Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో దూకుడు పెంచింది కాంగ్రెస్. ఈసారి తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉంది. ఇప్పటికే పలు భారీ సభలను తలపెట్టింది. కీలక హామీలపై డికర్లేషన్ లను కూడా చేసింది. రాబోయే రోజుల్లో అగ్రనేతల పర్యటనలు కూడా ఉండనున్నాయి. గెలిచే అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్... ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్న.... పలువురు సీనియర్ నేతలు తమపై 'కుట్ర' చేస్తున్నారంటూ గొంతెత్తటం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరికొందరు నేతలు సైలెంట్ మోడ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఫలితంగా అసలు తెలంగాణ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాలతో కేడర్ కూడా కన్ఫ్యూషన్ లో పడినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక నేతలు కారెక్కుతారు...! జాబితా ఇదే అంటూ ప్రముఖంగా కొందరి నేతల పేర్లతో కూడిన లీక్ లు వస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఈ ప్రచారం మరింత ఊపందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్ధాల కాలంపాటు పార్టీతోనే ఉన్న సదరు నేతలు సడన్ గా ఎందుకు మారాల్సి వస్తోంది..? నిజంగానే పార్టీ మారుతున్నారా..? కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా అన్న కథనాలు కూడా జోరుగా ప్రసారమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేలా కొందరు నేతలు... బహిరంగంగానే తమ ఆవేదన వెల్లుబుచ్చారు. ఇటీవలే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్... బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిటీలో చోటు ఇవ్వకుండా కుట్ర చేశారని... ఇప్పుడు ఏకంగా పార్టీ మారుతున్నారంటూ దుష్ట్రచారానికి తెగబడ్డారంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు... ఇదంతా సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులే చేస్తున్నారంటూ ఓపెన్ గా చెప్పేశారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ తో ఉన్నానని చెప్పిన ఆయన... పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బాటలోనే నడుస్తానని చెప్పుకొచ్చారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా సేమ్..! సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారంటూ గతంలో ఆరోపించారు ఉత్తమ్. ఈ అంశంపై ఆగ్రహంతో ఉన్న ఉత్తమ్ కు ...ఇటీవలే కాలంలో వస్తున్న వార్తలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఉత్తమ్ దంపతులు కూడా గులాబీ పార్టీలో చేరుతున్నారంటూ తెగ ప్రచారం నడుస్తోంది. ఏకంగా పోటీ చేసే స్థానాలు కూడా బయటికి వస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ మార్పు అంశంపై స్పందిస్తూ... చాలాసార్లు ఖండించారు ఉత్తమ్. కానీ ప్రచారం మాత్రం ఆగలేదు. వీటన్నింటికి బదులిచ్చేలా తాజాగా ఓ లేఖను కూడా విడుదల చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్ లోని ఓ కీలక నేతనే చేయిస్తున్నారంటూ... సూటిగా చెప్పేశారు. కాంగ్రెస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ... భావోద్వేగపూరితమైన అంశాలను ప్రస్తావించారు. గత 2 సంవత్సరాలుగా పూర్తిగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలతో నిరంతరం తమను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకని పేర్కొన్నారు.

ఇలా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సొంత పార్టీలోని నేతలే కుట్ర చేస్తున్నారంటూ చెప్పటంతో... టీ కాంగ్రెస్ లోని పరిస్థితులు అర్థంకాకుండా మారిపోయాయి. ఇక ఉమ్మడి మెదక్ , నల్గొండ జిల్లాకు చెందిన కొందరి నేతల పేర్లు కూడా పార్టీ మారే జాబితాలో ఉన్నాయి. సదరు నేతలు మాత్రం... సైలెంట్ మోడ్ ఆప్షన్ నే ఎంచుకున్నారు. వారు కూడా తమపై కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడుతారా..? లేక వచ్చిన వార్తలను నిజం చేస్తూ... కారెక్కుతారా అనేది చూడాలి.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మళ్లీ తెరపైకి వస్తున్నట్లు కనిస్తోంది. అసలు వీరిపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..? ఎందుకు కుట్ర చేస్తున్నారనేది కూడా...? టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. పార్టీ నుంచి బయటికి పంపేందుకు ఓ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారా అన్న కోణంలో కూడా చర్చ కూడా మొదలైంది. వీటన్నింటినికి బాధ్యులు ఎవరనే దానిపై హైకమాండ్ జోక్యం చేసుకుంటుందా..? లేక సీనియర్ నేతల ఆవేదనను లైట్ గా తీసుకుంటుందా అనేది చూడాలి...?

Whats_app_banner

సంబంధిత కథనం