Independence day 2023 : భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి పోసిన "తిరుగుబాటు"!
07 August 2023, 16:07 IST
- Independence day 2023 : భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికిన ఘట్టం ‘1857 సిపాయి తిరుగుబాటు’! దీని వెనుక అసలు కారణం ఏంటి? అసలేం జరిగింది? రండి.. 2023 స్వాతంత్ర్యి దినోత్సవం నేపథ్యంలో మన దేశ చరిత్రను ఓసారి నెమరవేసుకుందాము..
భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి పోసిన సిపాయిల "తిరుగుబాటు"!
Independence day 2023 : భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది.. "1857 తిరుగుబాటు"! ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించి, బ్రిటీషర్లకు చెమటలు పట్టించిన ఘటన అది. 1857 తిరుగుబాటుకు కారణాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది?
1857 తిరుబాటుకు చాలా పేర్లు ఉన్నాయి. అవి.. సిపాయ్ మ్యూటినీ, ఇండియన్ మ్యూటినీ, గ్రేట్ రెబీలియన్, రివోల్ట్ ఆఫ్ 1857, స్వాతంత్ర్యం కోసం జరిగిన తొలి యుద్ధం! 1857 తిరుగుబాటుకు పలు కీలక కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాము..
సైనికుల తిరుగుబాటు..
దేశంలోని బ్రిటీష్ సైన్యంలో భారతీయుల వాటా 87శాతం వరకు ఉండేది. కానీ భారత సైనికులకు బ్రిటీషర్లతో పోల్చుకుంటే జీతం చాలా తక్కువ! ఒకటే ర్యాంక్‌లో ఉన్నా.. వేతనం తక్కువగా ఇచ్చేవారు. దీనిపై చాలా దశాబ్దాలుగా జవాన్లలో అసంతృప్తి ఉండేది. పైగా.. ఇంటి నుంచి చాలా దూరంగా వీరు పనిచేయాల్సి వచ్చేది. చేస్తున్న పనికి, అందే జీతానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది. ఇక 1856లో.. భారత సైనికులు అవసరమైతే సముద్రాలు దాటి కూడా బ్రిటీష్ ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆదేశాలి ఇచ్చారు లార్డ్ కన్నింగ్. ఈ మేరకు జనరల్ సర్వీసెస్ ఎన్‌లైట్‌మెంట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు.
1857 Revolt in Telugu : ఇది ఇలా ఉండగా.. ప్రజలపై భారీ మొత్తంలో పన్నులను విధించడం మొదలుపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫలితంగా రైతులు, జమిందారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పులను తీర్చుకోలేక, పన్నులు కట్టుకోలేక నలిగిపోయేవారు. ఒకానొక దశలో చాలా మంది భూములను కూడా కోల్పోయారు. బ్రిటీష్ సైన్యంలో ఉన్న అనేకమంది భారతీయులు.. వ్యవసాయ కులీల కుటుంబం నుంచి వచ్చిన వారే. గ్రామాల్లో కుటుంబసభ్యులు పడుతున్న కష్టాలు చూసి వారందరు కన్నీరుపెట్టుకునే వారు.
వాస్తవానికి ఇవన్నీ చాలా ఏళ్లుగా భారతీయులు అనుభవిస్తున్న వ్యధే. కానీ 1857 తిరుగుబాటుకు ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉంది. అదే క్యాట్రిజ్పై చుట్టూ నెలకొన్న వివాదం!
భారత సైనికుల చేతికి సరికొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అందాయి. అయితే.. సమస్యంతా క్యాట్రిజ్తోనే. ఆ క్యాట్రిజ్ పేపర్‌ను నోటితో చింపి, రైఫిల్స్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని ఆవు, పంది కొవ్వుతో తయారు చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. అవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు. ఇక హిందూ సైనికుల కోపం కట్టెలు తెంచుకుంది! వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతినివ్వడంతో సిపాయి తిరుగుబాటు మొదలైంది.
1857 Revolt and its impact : 1857 మార్చ్‌లో బారక్పోరాకు చెందిన మంగళ్ పాండే.. క్యాట్రిజ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు. ఇది జరిగిన నెల రోజులకు.. మీరట్‌కు చెందిన మరో 85 మంది సైనికులు.. కొత్త రైఫిల్స్‌ను వాడమని తేల్చిచెప్పారు. వారికి 10ఏళ్ల కఠిన జైలు శిక్షపడింది. ఆ తర్వాత ఆ ప్రాంతం జవాన్లు పూర్తిగా తిరగబడ్డారు!
డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్..
ఇండియాపై పట్టు సాధించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. చట్టాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న రోజుల అవి. అప్పుడే.. మరో వివాదానికి తెరలేపారు బ్రిటీషర్లు. అదే "డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్". ఒక్క మాటలో చెప్పాలంటే, దీని ప్రకారం.. సహజంగా వారసులు లేని రాజులు, తమ రాజ్యాలని బిటీషర్లకు ఇచ్చేయాలి. దత్త పుత్రులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు. హిందూ మతానికి విరుద్ధంగా, పాశ్చ్యాత ఆచారాలను ఇండియాపై రుద్దాలని బ్రిటీషర్లు భావిస్తున్నట్టు అప్పటికే కోపం మీద ఉన్న రాజ్యాలు.. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ చూసి ఇక విసుగెత్తిపోయాయి.
Doctrine of lapse : ఇక్కడ.. ఝాన్సీ లక్ష్మీ భాయ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆమె ధైర్య సాహసాలు.. దేశ చరిత్రలో నిలిచిపోతాయి. ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్‌కి సహజ సంతానం లేకపోవడంతో దామోదర్ రావును దత్తత తీసుకుంది. అతనికి సింహాసనాన్ని కట్టుబెట్టాలని చూడగా.. బ్రిటీషర్లు అడ్డుపడ్డారు. సిపాయి మ్యుటినీ మొదలైన సమయంలో.. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కూడా బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసింది.
స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి..!
కాన్పూర్, లక్నో, బరేలీ, ఝాన్సీ, గ్వాలియర్, పట్నా, రాజస్థాన్ సరిహద్దు వరకు ఈ 1857 తిరుగుబాటు విస్తరించింది. ఒక్కో రాజ్యం.. ఝాన్సీ లక్ష్మీ భాయ్ తిరుగుబాటుకు మద్దతినస్తూ వచ్చింది. పలువురు రాజులు సైతం బ్రిటీషర్లపై పోరాటంలో పాల్గొన్నారు.
మరోవైపు 1857 మేలో ఉత్తర భారతంలోని దేశ సైనికులు దిల్లీవైపు అడుగులు వేశారు. ఆ సమయంలో బ్రిటీష్ సైన్యం అక్కడ లేదు. జెండా ఎగురవేసిన భారత జవాన్లు.. బ్రిటీషర్ల పింఛనుపై జీవిస్తున్న ముఘల్ రాజు మహదూర్ షా 2ను దేశ చక్రవర్తిగా ప్రకటించారు.
విజయం సాధించలేదు కానీ..!
1857 sepoy mutiny reason : 1857 తిరుగుబాటును అంతం చేసేందుకు బ్రిటీషర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత ఆలస్యంగా కదిలినా, ఆ తర్వాత వేగంగా పావులు కదుపుతూ.. ఒక్కో తిరుగుబాటు ప్రాంతంపై పట్టు సాధిస్తూ వచ్చారు. చివరికి.. 1858 జులై 8న, అంటే 14నెలల తర్వాత.. తిరుగుబాటుకు ముగింపు పడింది!
తిరుగుబాటు అంతం అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది దేశం మొత్తం విస్తరించలేదు. స్వాతంత్ర్య కాంక్ష కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. హైదరాబాద్, మైసూర్, కశ్మీర్ వంటి ప్రావిన్సులపై దీని ప్రభావం శూన్యం. మరోవైపు ఝాన్సీ లక్ష్మీ భాయ్, నానా సాహెబ్ వంటి వీరులు ఉన్నప్పటికీ, దళాలను ఐకమత్యంతో నడిపే నాయకుడు లేకపోవడం తిరుగుబాటు పతనానికి కారణమని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా.. ఈ తిరుగుబాటుకు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించలేదు! అదే.. 1947కు 1857కు ఉన్న తేడా! ఏదైనా ఉద్యమం విజయవంతం అవ్వాలంటే.. కింది స్థాయి నుంచి మద్దతు ఉండాల్సిందే. అది ఇక్కడ జరగలేదు. అదే సమయంలో ధనవంతులైన వ్యాపారులు, జమిందారులు.. బ్రిటీషర్లకు అనుకూలంగా పనిచేశారు.
తిరుగుబాటు ముగింపు తర్వాత.. బ్రిటీషర్లు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు! బ్రిటీష్ రాజ్యం కిందకు ఇండియాను చేర్చారు. ఫలితంగా దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ శకం ముగిసింది. దేశంలోని మతాలు, ఆచారాలకు విలువనిస్తామని బ్రిటీష్ చెప్పింది. పాలనా వ్యవస్థను కీలక మార్పులు తీసుకొచ్చింది. సైనిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్‌ను తొలగించింది.
అసలు కథ ఇప్పుడే మొదలైంది..!
India Independence Telugu : 1857 సిపాయి తిరిగుబాటు అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ.. దేశ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడైతే అణచివేత చర్యలు హెచ్చుమీరుతాయో, అక్కడ ప్రతిఘటన ఎదురవ్వడం తప్పదని మరోమారు నిరూపించింది. బానిస సంకెళ్లతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు.. స్వతంత్ర భారత దేశం కోసం కలలు కనే ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి భారత దేశ చరిత్రే మారిపోయింది...