IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్
17 May 2024, 17:28 IST
IMD predictions: రానున్న ఐదు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు, ఉత్తర ప్రదేశ్, హరియాణాల్లో మరో 4 రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించింది.
ఆంధ్ర, తెలంగాణల్లో మరో నాలుగు రోజులు వర్షాలు
IMD predictions: మే 21 వ తేదీ వరకు కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం
దక్షిణ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి, రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా దిగువ, మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా
తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో మరో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 17 నుంచి 21 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహేలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో మే 20,21 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 20-21 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.
ఉత్తరాదిన వడగాలులు
పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్ లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. పంజాబ్, హరియాణాలో కూడా ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ కు దగ్గరగా ఉందని, యూపీ సహా ఆయా రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయని తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో మరో ఐదు రోజులు, మధ్యప్రదేశ్, బిహార్లలో నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఉష్ణోగ్రత కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. ఐఎండీ బులెటిన్ ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.