UAE rains: యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో భారీ వర్షాలు: ఒమన్ వరదల్లో18 మంది మృతి
17 April 2024, 9:01 IST
Dubai rains: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ దేశాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. యూఏఈ లో రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపేశారు. ఒమన్ లో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది.
దుబాయ్ లోని షేక్ జాయెద్ రోడ్ పై వర్ష బీభత్సం
Dubai rains: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు పొరుగున ఉన్న ఒమన్ లో సంభవించిన భారీ వరదల్లో (OMAN floods) మృతుల సంఖ్య 18కి చేరింది. ఇంకా పదుల సంఖ్యలో పౌరుల ఆచూకీ తెలియడం లేదు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ (DUBAI RAINS) అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల నగర వీధులు భారీ చెరువులను తలపిస్తున్నాయి.
సహాయ చర్యలు ముమ్మరం
దుబాయి (DUBAI) వర్షాలకు తోడు ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో పోలీసులు, అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది సహాయ చర్యలలో నిమగ్నమయ్యారు. వరదనీటితో నిండిన వీధుల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) చివరను అప్పుడప్పుడు తాకుతూ ఆకాశంలో మెరుపులు మెరిశాయి.
స్కూల్స్ బంద్
తుపానుకు ముందు ఏడు షేక్ రాజ్యాల సమాఖ్య అయిన యూఏఈ (UAE) లోని దాదాపు అన్ని పాఠశాలలను మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలావరకు రిమోట్ గా పనిచేస్తున్నారు. చాలా మంది కార్మికులు ఇళ్లలోనే ఉండిపోయారు. అత్యవసర విధులపై బయటకు వచ్చినవారి వాహనాలు రహదారులపై లోతైన నీటిలో నిలిచిపోయాయి. నీటిని తోడేందుకు అధికారులు ట్యాంకర్ ట్రక్కులను వీధులు, హైవేలపైకి పంపించారు.
దుబాయిలో 30 ఎంఎం వర్షపాతం
అరేబియా ద్వీపకల్ప దేశమైన యూఏఈ (UAE) లో వర్షాలు కురవడం చాలా అసాధారణం. కానీ కొన్నిసార్లు శీతాకాలంలో అక్కడ వర్షాలు కురస్తుంటాయి. క్రమం తప్పకుండా వర్షాలు కురవకపోవడంతో పలు రోడ్లు, ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా నిర్వహించరు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ సారి కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దుబాయ్ లో ఉదయం 30 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసిందని, రోజంతా 128 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా వర్షం కురిసింది.
ఒమన్ లో 18 మంది దుర్మరణం; 10 మంది చిన్నారులు కూడా..
యూఏఈ కి పొరుగున ఉన్న ఒమన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల (OMAN floods) కారణంగా కనీసం 18 మంది మరణించారని ఆ దేశ నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అందులో సుమారు 10 మంది పాఠశాల పిల్లలున్నారు. వారు ప్రయాణిస్తున్నవాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది.