Dubai visa: దుబాయి వెళ్లే భారతీయులకు శుభవార్త; మల్టిపుల్ ఎంట్రీ వీసాకు గ్రీన్ సిగ్నల్-dubai introduces 5 year multiple entry visa for indians to boost travel ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dubai Visa: దుబాయి వెళ్లే భారతీయులకు శుభవార్త; మల్టిపుల్ ఎంట్రీ వీసాకు గ్రీన్ సిగ్నల్

Dubai visa: దుబాయి వెళ్లే భారతీయులకు శుభవార్త; మల్టిపుల్ ఎంట్రీ వీసాకు గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 04:04 PM IST

Dubai visa: భారతీయులకు దుబాయ్ శుభవార్త తెలిపింది. ఇండియన్స్ కు బహుళ ఎంట్రీలు / ఎగ్జిట్ లకు ఉపయోగపడేలా 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెడ్తున్నట్లు ప్రకటించింది.

దుబాయికి ఇక మల్టిపుల్ ఎంట్రీ వీసా
దుబాయికి ఇక మల్టిపుల్ ఎంట్రీ వీసా (File Photo)

Dubai visa: భారతీయులకు ఐదేళ్ల మల్టిపుల్-ఎంట్రీ వీసాను దుబాయి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) శుక్రవారం ప్రకటించింది. 2023 లో ఇండియా నుండి 2.46 మిలియన్ల మంది పర్యాటకులు దుబాయికి వెళ్లారు. ఇది కొరోనా మహమ్మారికి ముందు సంవత్సరాలతో పోలిస్తే 25 శాతం ఎక్కువ. 2023 లో మొత్తంగా 17.15 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు దుబాయిలో పర్యటించగా, 2022 లో ఈ సంఖ్య 14.36 మిలియన్లుగా ఉంది.

2022 లో..

2022 లో భారతదేశం నుండి 1.84 మిలియన్ల పర్యాటకులు దుబాయికి వెళ్లగా, 2019 లో 1.97 మిలియన్ల సందర్శకులు ఆ నగరంలో పర్యటించారు. భారత్ నుంచి దుబాయికి వెళ్తున్న పర్యాటకుల సంఖ్యలో గత సంవత్సరం 34 శాతం అసాధారణ వృద్ధి నమోదైంది. ఒక దేశం నుండి దుబాయికి పర్యటనకు వచ్చిన వారిలో అత్యధికులు భారత్ నుంచే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్-దుబాయ్ మధ్య పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, స్థిరమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటకం, వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడానికి దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిందని డీఈటీ తెలిపింది.

సంవత్సరంలో 180 రోజులు

వీసా అభ్యర్థనను స్వీకరించి, ఆ అభ్యర్థన ఆమోదం పొందిన తర్వాత 2 నుంచి 5 పనిదినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసా పొందిన వారు ఒక సంవత్సరంలో గరిష్టంగా 180 రోజులు దుబాయిలో ఉండవచ్చు. అయితే, వారు 90 రోజులు ఉన్న తరువాత మరోసారి, మరో 90 రోజుల కోసం మళ్లీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ వీసా పొందిన వారు ఐదు సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ సదుపాయాన్ని పొందుతారు. ఇది ముఖ్యంగా వ్యాపార, ఉద్యోగ విధుల్లో భాగంగా దుబాయికి వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.