UAE first hindu temple: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. దీన్ని ప్రాముఖ్యతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!-united arab emirates first hindu temple baps specialities ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Uae First Hindu Temple: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. దీన్ని ప్రాముఖ్యతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

UAE first hindu temple: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. దీన్ని ప్రాముఖ్యతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gunti Soundarya HT Telugu
Feb 14, 2024 10:38 AM IST

UAE first hindu temple: హిందువులు గర్వించదగ్గ క్షణాలు ఇవి. ముస్లిం దేశమైన అబుదాబిలో తొలి హిందూ దేవాలయం నిర్మించారు. ఫిబ్రవరి 14 న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభోత్సవం జరగనుంది.

అబుదాబిలోని తొలి హిందూ దేవాలయం
అబుదాబిలోని తొలి హిందూ దేవాలయం (AP)

UAE first hindu temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే అక్కడి ఆంక్షలు గురించి ఎక్కువగా గుర్తుకు వస్తుంది. మహిళల మీద కఠినమైన ఆంక్షలు ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితులు చాలా మారాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ పని చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భారత్ నుంచి ఎంతో మంది జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు.

సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ తొలి BAPS హిందూ దేవాలయం నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆ దేశంలోనే తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది.

ఏడు శిఖరాలకు ప్రతీక

యూఏఈ లోని ఏడు ఎమిరేట్స్‌కి ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు. ఇందులో రామాయణం, మహా భారతం, భాగవతం, శివ పురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలు ఉన్నాయి. ఈ శిఖరాల మీద వేంకటేశ్వర స్వామి, నారాయణుడు, జగన్నాథుడు, అయ్యప్ప వంటి దేవుళ్ళకి సంబంధించిన వర్ణనలు అందంగా చెక్కారు.

పంచ భూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం మూలకాలని సూచించే విధంగా డోమ్ ఆఫ్ హార్మోని రూపొందించారు. ఈ ఆలయం గోడల మీద గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల బొమ్మలని చెక్కారు. అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామ మందిర నమూనాని 3 డీ రూపంలో ఏకశిలపై రూపొందించారు.

ఈ ఆలయం 108 అడుగుల ఎత్తుగా ఉంటుంది. ప్రాచీన హిందూ గ్రంథాలైన శిల్ప శాస్త్రాల నుంచి ప్రేరణగా ఈ ఆలయం రూపొందించారు. పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారనున్న ఈ భారీ నిర్మాణంలో సుమార్పు 10 వేల మందికి వసతి కల్పించవచ్చు.

ఈ ఆలయం అధునాతన సెన్సార్ టెక్నాలజీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయం పునాధి భాగంలో 100 సెన్సార్లు, ఆలయం అంతటా 350 సెన్సార్లని ఏర్పాటు చేశారు. ఇవి భూకంపాలు, వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, పీడన మార్పులకు సంబంధించిన డేటాను రికార్డ్ చేసి అందిస్తాయి.

పింక్ రాయితో నిర్మాణం

రాజస్థాన్, ఇటలీ నుంచి తీసుకొచ్చిన గులాబీ రంగు రాయి, తెల్లని పాలరాయితో దీని నిర్మించారు. మన దేశానికి చెందిన దాదాపు 1500 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ రాతి దిమ్మెలని చేతితో చెక్కారు. 40 వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి, ఇటాలియన్ మార్బుల్.. 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకని వినియోగించారు.

ఈ ఆలయ సముదాయంలో గంగా, యమునా వంటి పవిత్ర నదుల ప్రవాహాన్ని తలపించే విధంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు. ఈ లయం సముదాయంలో ఉన్న ఫుడ్ కోర్ట్ లో రీసైకిల్ చేసిన చెక్క ప్యాలెట్ లతో బెంచీలు, టేబుల్స్, కూర్చులు రూపొందించారు.

ఆలయ చరిత్ర

2018 లో ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అబుదాబిలో నిర్మించే ఈ హిందూ దేవాలయానికి యూఏఈ ప్రభుత్వం 2015 లో భూమిని కేటాయించింది. బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ హిందూ దేవాలయాన్ని నిర్మించింది.

ఈ ఆలయానికి ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మొహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తన 27 ఎకరాల భూమిని బాహుమానంగా ఇచ్చారు. సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని అంచనా.

WhatsApp channel