UAE's 1st Hindu temple: యూఏఈలో తొలి హిందూ దేవాలయం; ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు ప్రారంభం
UAE's 1st Hindu temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని తొలి హిందూ దేవాలయమైన బీఏపీఎస్ హిందూ మందిరాన్ని 2024 ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని అబుదాబీలో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
అబుదాబీలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం (Bloomberg)
UAE's 1st Hindu temple: మిడిల్ ఈస్ట్ లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయమైన బీఏపీఎస్ హిందూ మందిర్ ను ఫిబ్రవరి 14 న అబుదాబిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించనున్న ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ సోమవారం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో మహంత్ స్వామి మహరాజ్ కు యూఏఈ మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ షేక్ నహయాన్ మబరక్ అల్ నహ్యాన్ సాదరంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14, బుధవారం అబుదాబీ చేరుకుంటారు.
బీఏపీఎస్ ఆలయ ప్రత్యేకతలు
- ఇది యూఏఈ లోని మొదటి హిందూ దేవాలయం.
- బీఏపీఎస్ హిందూ మందిర్ నిర్మాణంలో పింక్ రాజస్థాన్ ఇసుకరాయి, ఇటాలియన్ వైట్ పాలరాతి రాళ్లను ఉపయోగించారు. వీటిని భారత్ లో రూపొందించి, యూఏఈకి రవాణా చేశారు.
- 2015 లో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించినప్పుడు అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.
- జనవరి 2019 లో, యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. దాంతో, మొత్తం 27 ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
- 2017లో ప్రధాని మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.
- ఈ ఆలయంలోని ఏడు గోపురాలు ఒక్కొక్కటి ఒక్కో యూఏఈ ఎమిరేట్ కు ప్రతీకలుగా నిలుస్తాయి.
- ఆలయ సముదాయంలో సందర్శకుల కేంద్రం, ప్రార్థనా మందిరాలు, థీమాటిక్ గార్డెన్స్, అభ్యాస ప్రాంతాలు మొదలైనవి ఉన్నాయి.
- భూకంప కార్యకలాపాలు, ఉష్ణోగ్రత మార్పులు మొదలైన వాటిని ట్రాక్ చేయడానికి ఆలయ పునాదిలో 100 సెన్సార్లను అమర్చారు.
- ఈ ఆలయ నిర్మాణానికి 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ ఖర్చు అయ్యాయని అంచనా.