Google Gemini app: భారతీయులకు శుభవార్త; తెలుగు సహా 9 భారతీయ భాషల్లో ‘జెమిని మొబైల్ యాప్ ను లాంచ్ చేసిన గూగుల్
18 June 2024, 15:18 IST
చాట్ జీపీటీ తరహా సేవలను అందించే జెమిని మొబైల్ యాప్ ను గూగుల్ సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. ఇంగ్లీష్ తో పాటు 9 భారతీయ భాషల్లో ఈ యాప్ సేవలను పొందవచ్చు. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని గూగుల్ కంపెనీ తెలిపింది.
గూగుల్ జెమిని మొబైల్ యాప్ లాంచ్
Google Gemini app: గూగుల్ తన జనరేటివ్ ఏఐ చాట్ బాట్ జెమిని మొబైల్ యాప్ (Google Gemini app) ను ఇంగ్లీష్ తో పాటు తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేసింది. ‘‘గూగుల్ యొక్క అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడళ్ల సేవలను వినియోగదారులకు అందించే జెమినీ మొబైల్ యాప్, జెమినీ అడ్వాన్స్డ్ రెండూ ఇప్పుడు తొమ్మిది భారతీయ భాషలలో అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది భారతీయులు తమకు అవసరమైన సమాచారాన్ని వారికి నచ్చిన భాషలో యాక్సెస్ చేయడానికి ఇవి సహాయపడుతాయి’’ అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది.
9 ఇండియన్ లాంగ్వేజెస్ లో..
హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ చాట్ జీపీటీ తరహా సేవలను అందించే జెమిని మొబైల్ యాప్ (Google Gemini app) అందుబాటులో ఉంటుంది. జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు. అంతేకాకుండా, గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. ఇందులో కొత్తగా డేటా విశ్లేషణ సామర్థ్యాలు, ఫైల్ అప్ లోడింగ్, ఇంగ్లీష్ లో గూగుల్ సందేశాలలో జెమినితో చాట్ చేసే అవకాశం వంటి ఫీచర్స్ ఉన్నాయి.
విదేశాల్లో కూడా..
భారతదేశంతో పాటు, ఈ జెమిని మొబైల్ యాప్ ను టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో కూడా ప్రారంభించారు. గూగుల్ జెమిని మొబైల్ యాప్ లాంచ్ గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ప్రకటించారు. ‘‘మీకు అవసరమైన సేవలను పొందడానికి, టైప్ చేయడానికి, మాట్లాడటానికి లేదా ఇమేజ్ ను జోడించడానికి ఈ యాప్ లో వీలు ఉంటుంది. ఫ్లాట్ టైర్ ను ఎలా మార్చాలో సూచనల కోసం ఒక చిత్రాన్ని తీయండి, లేదా సరైన థ్యాంక్స్ నోట్ రాయడానికి సహాయం పొందండి. ఈ యాప్ లో అంతులేని అవకాశాలు ఉన్నాయి’’ అని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ యాప్ ఒక సంభాషణాత్మక, మల్టీమోడల్, ఏఐ అసిస్టెంట్ ను వినియోగదారులకు అందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అన్నారు.
జెమినీ యాప్ ను ఎలా యాక్సెస్ చేయాలి
- నేరుగా ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
- లేదా గూగుల్ అసిస్టెంట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
- ‘కార్నర్ స్వైపింగ్’ ద్వారా లేదా ఎంపిక చేసిన ఫోన్లలో ‘పవర్ బటన్ నొక్కడం ద్వారా’ లేదా "హే గూగుల్" అని చెప్పడం ద్వారా మీరు జెమినిని ఉపయోగించవచ్చు.
- ఐఓఎస్ లో జెమినీ యాక్సెస్ నేరుగా గూగుల్ యాప్ నుంచి వస్తోంది కాబట్టి జెమినీ టాగిల్ ను ట్యాప్ చేసి చాటింగ్ ప్రారంభించవచ్చు.