Google Maps problems: గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని నేరుగా చెరువులోకి.. కేరళలో ప్రమాదంలో చిక్కుకున్న హైదరాబాదీలు
Google Maps problems: హైదరాబాద్ కు చెందిన పర్యాటకులు తమ ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించి కేరళలోని ఒక వాగులోకి దూసుకెళ్ళారు.
Google Maps problems: గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి హైదరాబాద్ కు చెందిన ఓ పర్యాటక బృందం దక్షిణ కేరళలోని కురుప్పంతార సమీపంలో నీటితో నిండిన వాగులోకి దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సహా నలుగురు సభ్యుల బృందం అలప్పుజ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేరళలో ఇప్పుడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆ భారీ వర్షాల కారణంగా వాగు నుంచి పొంగిపొర్లుతున్న నీటితో తాము ప్రయాణిస్తున్న రహదారి నిండిపోయిందని, పర్యాటకులకు ఈ ప్రాంతం తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి నావిగేట్ చేస్తూ నేరుగా జలాశయంలోకి వెళ్లారని వారు తెలిపారు.
అదృష్టవశాత్తూ..
సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ యూనిట్, స్థానికుల ప్రయత్నాల వల్ల హైదరాబాద్ కు చెందిన ఆ నలుగురు ప్రయాణికులు ప్రాణాపాయం లేకుండా తప్పించుకోగలిగారు. కానీ వారి వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కడుతుర్తి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ లో గూగుల్ మ్యాప్స్ సూచనలను పాటించి.. తమ కారుతో పాటు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో వర్షాకాలంలో ప్రయాణాలు చేస్తున్న సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కేరళ పోలీసులు సూచించారు.