Karimnagar District : శ్రీలంక అమ్మాయి, రామడుగు అబ్బాయి ఒక్కటయ్యారు
Karimnagar District News : శ్రీలంక అమ్మాయిని కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్బాయి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుక ఘనంగా జరగా… మంత్రి పొన్నం కూడా హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
Karimnagar District News : లంకేయుని రాజ్యంలో పుట్టిన ఆడబిడ్డ...రాముని పాదం తాకిన నేలపై అడుగుపెట్టింది. శ్రీలంక అమ్మాయి, రామడుగు కు చెందిన అబ్బాయి లండన్ లో ప్రేమాయణం సాగించి ఇండియాకు తిరిగొచ్చి కరీంనగర్ లో సాంప్రదాయ పద్దతిలో మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలుగా మారారు. ప్రేమ పెళ్ళి చేసుకున్న నవదంపతులు రాముడు నడియాడిన నేల రామడుగులో మెట్టినింటికి చేరారు. అనుకోకుండా ఏర్పడిన ఆత్మీయ బంధంతో కరీంనగర్ లో జరిగిన పెళ్ళి వేడుకలో పలు ప్రత్యేకతలు సంతరించుకున్నాయి.
ఇలా కుదిరింది….
కరీంనగర్ జిల్లా(Karimnagar) రామడుగు మండలం పందికుంటపల్లికి చెందిన కటుకం సురేందర్ జీవనోపాధి కోసం లండన్ కు వెళ్ళాడు. 2018 నుండి అక్కడే ఉద్యోగం చేస్తున్న సురేందర్ కు శ్రీలంక కు చెందిన జానుశిఖతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమ వరకు చేరడంతో మనసులు కలిసిన వారిద్దరు వైవాహిక బంధంతో జీవితాంతం కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు కూడా తమ కుటుంబసభ్యులకు చెప్పి ఒప్పించారు. ఇరు కుటుంబాలకు చెందిన వారు సురేందర్, జానుశిఖ ల కోరికలను ఆశీర్వదించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అందరి ఆమోదంతో కరీంనగర్ లో ఘనంగా వివాహం నిర్వహించారు. వధువరులను రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రముఖులు ఆశీర్వదించి అభినందించారు.
హిందూసాంప్రదాయంతో వివాహం..
సురేందర్ జీవిత భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకున్న జాను శిఖ మెట్టినింటి సాంప్రాదాయలను గౌరవించారు. సురేందర్ పూర్వీకుల నుండి సాంప్రాదాయబద్దంగా సాగుతున్న తీరుకు అనుగుణంగా పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం విశేషం. దీంతో హైందవ ఆచార వ్యవహారాల ప్రకారం నిర్వహించిన వివాహంతో సురేందర్, జాను శిఖలు ఒక్కటయ్యారు. అయితే రామాయంణంలో రావణుడి రాజ్యమైన శ్రీలంకకు చెందిన యువతి... అరణ్య వాసం చేసినప్పుడు శ్రీరాముడు నడియాడిన నేల అయిన రామడుగుకు చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ప్రత్యేకతలు వారి సొంతమయ్యాయి.
రిపోర్టింగ్ - HT Correspondent K.V.REDDY, Karimnagar