Google Gemini: జెమినీ ఏఐ యూజర్లకు గూగుల్ బిగ్ వార్నింగ్; ఆ విషయంలో జాగ్రత్త..
Google AI chatbot Gemini: తమ ఏఐ ఆధారిత చాట్ బాట్ ‘జెమిని’ యూజర్లకు గూగుల్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల గూగుల్ తమ చాట్ బాట్ పేరును బార్డ్ నుంచి జెమినీ గా మార్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా, ఈ కృత్రిమ మేథ ఆధారిత చాట్ బాట్ జెమినీ వినియోగంపై యూజర్లకు పలు హెచ్చరికలు జారీ చేసింది.
Google warning to users: గూగుల్ ఇటీవల తన జనరేటివ్ ఏఐ ఆధారిత చాట్ బాట్ కు అనేక అప్ గ్రేడ్లను ప్రకటించింది. వీటిలో దాని పేరును బార్డ్ నుండి జెమినీగా మార్చడం, కొత్త ఆండ్రాయిడ్ యాప్ ను విడుదల చేయడం, కొత్త అల్ట్రా 1.0 లాంగ్వేజ్ మోడల్ ను ఆవిష్కరించడం వంటివి ఉన్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే జెమినీ యూజర్లందరికీ గూగుల్ గట్టి వార్నింగ్ ఇచ్చి, ఎలాంటి వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చాట్ బాట్ జెమినీ తో పంచుకోవద్దని కోరింది.
సమాచారం సేఫే.. అయినా..
వినియోగదారులు గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ (Gemini) తో పంచుకున్న సమాచారాన్ని నాణ్యత పరీక్షల నిమిత్తం, అలాగే, తమ ఉత్పత్తులను మరింత మెరుగుపర్చుకోవడం కోసం కొందరు ఉద్యోగులు సమీక్షిస్తారని గూగుల్ తెలిపింది. అయితే, సాధారణంగా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఆ సమీక్షకుల వద్దకు వెళ్లదని, అలాగే, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు కూడా షేర్ చేసుకోబోమని స్పష్టం చేసింది. అయినా, రహస్య, వ్యక్తిగత సమాచారాన్ని జెమినీ తో పంచుకోవద్దని గూగుల్ కోరుతోంది.
యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేయండి..
‘‘దయచేసి మీ సంభాషణలలో రహస్య సమాచారాన్ని లేదా సమీక్షకుడు చూడాలని లేదా Google ఉపయోగించాలని మీరు కోరుకోని ఏదైనా డేటాను నమోదు చేయవద్దు’’ అని గూగుల్ సూచించింది. మీ సంభాషణలను మీ గూగుల్ ఖాతాలో సేవ్ చేయకుండా జెమినీ యాప్స్ ఉపయోగించాలనుకుంటే, మీరు మీ జెమినీ యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేయవచ్చు. మీరు మీ ప్రాంప్ట్ లను సమీక్షించవచ్చు లేదా myactivity.google.com/product/gemini వద్ద మీ జెమినీ యాప్స్ యాక్టివిటీ నుండి మీ సంభాషణలను తొలగించవచ్చు’’ అని గూగుల్ షేర్ చేసిన డాక్యుమెంట్ వివరించింది.
గూగుల్ జెమిని ఎలాంటి డేటాను స్టోర్ చేస్తుంది?
గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినిని ఉపయోగించినప్పుడు వినియోగదారుల సంభాషణలు, లొకేషన్, ఫీడ్ బ్యాక్, వినియోగ సమాచారాన్ని గూగుల్ సేకరిస్తుంది. అయితే జెమినీని మొబైల్ అసిస్టెంట్ గా సెటప్ చేసినప్పుడు మాత్రం యూజర్ ప్రశ్నలను, అవసరాలను అర్థం చేసుకోవడానికి, స్పందించడానికి అదనపు సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ తెలిపింది. వినియోగదారు డేటాను సేకరించడానికి కారణాన్ని వివరిస్తూ ‘‘గూగుల్ ఉత్పత్తులు, సేవలు, మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలను యూజర్లకు అందించడానికి, మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి వీలుగా వినియోగదారుల సమాచారం తీసుకుంటాం’’ అని గూగుల్ తెలిపింది.