Big tech lay offs: ‘‘మరిన్ని లే ఆఫ్స్ కు సిద్ధంగా ఉండండి’’: ఉద్యోగులకు గూగుల్ సీఈఓ హెచ్చరిక
Big tech lay offs: 2024 ప్రారంభం నుంచి టెక్ కంపెనీల ఉద్యోగులకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు 2024 లో మరోసారి లే ఆఫ్ ల బాట పట్టాయి.
Big tech lay offs: గూగుల్, అమెజాన్ వంటి బడా టెక్ సంస్థలు ఈ జనవరిలో ఇప్పటివరకు 7,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ ఉద్యోగులపై మరో బాంబ్ వేశారు. రాబోయే నెలల్లో మరిన్ని ఉద్యోగాల కోత తప్పదని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు.
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా..
కంపెనీ లాభాలను పెంచడం, ఆదాయ వ్యయాల మధ్య అంతరాన్ని సమన్వయం చేయడం లక్ష్యంగా వివిధ విభాగాల నుంచి పలు ఉద్యోగాలను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు గూగుల్ (google) సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించనున్నట్లు ఒక మెమోలో పేర్కొన్నారు. ఈ రోల్ ఎలిమినేషన్లు గత ఏడాది తగ్గింపుల స్థాయిలో లేవని, ప్రతీ టీమ్ లో తొలగింపులు ఉండవని వివరించారు.
ఈ టీమ్స్ లో ఉద్వాసనలు
గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్ఫాబెట్.. తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్ వేర్ విభాగాల్లో వందలాది ఉద్యోగాలను తొలగించిన (lay off) కొద్ది రోజులకే గూగుల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. గూగుల్ నెస్ట్, పిక్సెల్, ఫిట్ బిట్, యాడ్ సేల్స్ టీమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్ ఈ లే ఆఫ్స్ లో ఎక్కువగా నష్టపోయాయి. ఫిట్ బిట్ సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రీడ్ మన్ లను కూడా ఈ బడా టెక్ సంస్థ తొలగించింది.
12 వేల మందికి లే ఆఫ్
జనవరి 2023 లో, ఆల్ఫాబెట్ తన ప్రపంచ శ్రామిక శక్తిలో 6% అంటే సుమారు 12,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. సెప్టెంబర్ 2023 నాటికి కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1,82,381 మంది ఉద్యోగులు ఉన్నారు. గూగుల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద తొలగింపు (lay off) అని, అయితే కంపెనీకి ఇది చాలా అవసరమని సుందర్ పిచాయ్ అన్నారు. కంపెనీలో భారీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వ్యయ తగ్గింపు చర్యగా గూగుల్ ఈ ఉద్యోగులను తొలగించింది.
కృత్రిమ మేధ కారణంగా..
అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక పునరుజ్జీవనంపై ఆశలతో కొత్త ఏడాది ప్రారంభం కాగా, కృత్రిమ మేధ (ఏఐ)లో పెట్టుబడులు పెట్టడం, వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తుండటంతో గ్లోబల్ బడా టెక్ సంస్థలు వరుస తొలగింపులతో 2024ను ప్రారంభించాయి. గూగుల్, అమెజాన్ వంటి గ్లోబల్ బడా టెక్ సంస్థలు 2024 జనవరి మొదటి రెండు వారాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. రాబోయే కొన్ని నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా మరిన్ని ఉద్యోగాలను తగ్గించడం కొనసాగిస్తామని ప్రకటించాయి. మొత్తం మీద జనవరిలో ఇప్పటివరకు టెక్ కంపెనీలు 7,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఆమెజాన్ గత వారం తన స్ట్రీమింగ్, స్టూడియో కార్యకలాపాలలోని కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ తో నేరుగా పోటీ పడుతూ కంపెనీలో ఉద్యోగాలు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి అమెజాన్, గూగుల్ రెండూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ మెంట్ లో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి.