Plant based meat : కోహ్లీ నుంచి జెనీలియా వరకు.. అందరి పెట్టుబడులు ఇందులోనే!
01 August 2022, 17:38 IST
- Plant based meat companies : దేశంలో ప్లాంట్ బేస్డ్ మీట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ పరిశ్రమలో ఇప్పటికే అనేకమంది ప్రముఖులు భారీగా పెట్టుబడులు పెట్టారు.
కోహ్లీ నుంచి జెనీలియా వరకు.. అందరి పెట్టుబడులు ఇందులోనే!
Plant based meat companies : దేశంలో 'శాకాహార మాంసం'కు డిమాండ్ విపరీతంగా పెరిగుతోంది. ఈ క్రమంలోనే అనేక స్టార్ట్అప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రికెటర్ల నుంచి సినీ తారల వరకు ఈ పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టి లబ్ధిపొందుతున్నారు!
శాకాహార మాంసం..
శాకాహార మాంసాన్ని సింపుల్‌గా చెప్పాలంటే.. పెంచిన మొక్కల నుంచి ప్రోటీన్లను తీసి.. వాటితో మాంసాన్ని తయారు చేయడం! భారతీయులకు ఇది పెద్దగా తెలియని విషయం. కానీ ఇందులో పోషకాలు విపరీతంగా ఉంటాయని, ఆరోగ్యవంతమైన జీవితం కోసం అందరు వీటిని ప్రయత్నించాలని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల్లో ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ హిట్ అయ్యింది. ఇండియాలో దీనికి ఆదరణ పెరుగుతున్న కొద్దీ.. అనేకమంది ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు.
బాలీవుడ్‌కు చెందిన జెనీలియా- రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు.. 'ఇమాజిన్ మీ' అనే స్టార్ట్అప్ను ప్రారంభించారు. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న 'బ్లూ ట్రైబ్' అనే కంపెనీలో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటికి పోటీగా.. దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ సైతం.. ఇటీవలే ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
Plant based meat : "నేను- విరాట్ ఎప్పటి నుంచో జంతు ప్రేమికులం. మాంసం రహిత జీవనశైలిని అనుసరించాలని ఎన్నో ఏళ్ల ముందే మేము నిర్ణయించుకున్నాము. అందుకే బ్లూ ట్రైబ్తో జతకట్టాము. ఎలా జాగ్రత్తగా ఉండాలి? భూమిని ఎలా కాపాడుకోవాలి?అని ప్రజలకు తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము," అని ప్రముఖ నటి అనుష్క శర్మ.. గతంలో ఓసారి వెల్లడించారు.
ఈ సంస్థల ప్రధాన ధ్యేయం.. శాకాహారంలో మాంసం రుచిని తీసుకురావడం. శాకాహార పదార్థాల్లో మాంసం, కిమా, కిబాబ్ల రుచి వచ్చే విధంగా వీటి ఉత్పత్తులు ఉంటాయి.
వ్యవసాయంలో.. యానిమల్ ఫార్మింగ్‌తో యేటా 60శాతం గ్రీన్‌హౌజ్ ఉద్గారాల వెలువడుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ప్లాంట్ బేస్డ్ మీట్.. పూర్తిగా పర్యావరణహితం అని అంటున్నాయి ఆయా సంస్థలు. కానీ దీనిని రుజువు చేసేందుకు తగిన ఆధారులు ఇంకా లభించలేదు!
Plant based meat India : అంతర్జాతీయంగా ఈ పరిశ్రమ మెరుగ్గానే రాణిస్తోంది! ఇంపాజిబుల్ ఫుడ్స్, బియాండ్ మీట్ వంటి సంస్థలు.. ఇప్పటికే మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అవి స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్‌కి కూడా ఎదిగాయి. తక్కువ మొత్తంలో భూమి, నీరు, ఎనర్జీని ఉపయోగించి శాకాహార మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని ఈ సంస్థలు చెబుతున్నాయి.
ప్లాంట్ బేస్డ్ మీట్ ఉత్పత్తులు చూడటానికి అచ్చం నిజమైన మాంసంలాగానే ఉంటాయి. ''ఇక తప్పదు' అని కాకుండా.. ఇంత రుచిగా ఉన్నాయేంటి?' అని లొట్టలేసుకుంటూ తింటారని పరిశ్రమ చెబుతోంది.
మాంసాన్ని మానేసిన వారికి.. తమ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను ఈ శాకాహార మాంసం అందిస్తుంది.
ఇక ఐటీసీ ప్రవేశంతో.. ఈ పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.
"ప్లాంట్ బేస్డ్ మీట్ ఆధారంగా బర్గర్ ప్యాటీలు, నగ్గెట్‌లను ఐటీసీ లాంచ్ చేస్తుంది. వీటి రుచి.. చికెన్‌లాగా ఉంటాయి. 8 నగరాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి," అని ఐటీసీ సంస్థ ఇటీవలే వెల్లడించింది.
Plant based meat products : యానిమల్ ఫార్మింగ్‌తో పర్యావరణానికి హాని జరుగుతుండటం.. ప్లాంట్ బేస్డ్ మీట్ పరిశ్రమకు కలిసి వస్తోంది! అదే నినాదంతో ఆయా సంస్థలు ప్రజల్లోకి వెళుతున్నాయి. వీటి వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని.. వర్సిటీ ఆఫ్ బాత్ అధ్యాయనం పేర్కొంది.
కానీ ఈ శాకాహార మాంసాన్ని మీట్ ఇండస్ట్రీ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శాకాహార మంసంతో పెద్దగా ప్రయోజనాలు లేవని ఆరోపిస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ మీట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.
ఫేక్-మీట్ బర్గర్లతో పోల్చుకుంటే.. బీఫ్ బర్గర్లో క్యాలరీలు 20శాతం తక్కువగాను, సోడియం 80శాతం ఎక్కువగానూ ఉంటుందని మాంసం ప్రేమికులు చెబుతున్నారు.