REIT : స్టాక్ మార్కెట్లో 'రియల్ ఎస్టేట్' వ్యాపారం.. పెట్టుబడి తక్కువ- లాభాలు ఎక్కువ!
24 July 2022, 14:58 IST
- REIT investment : 'రియల్ ఎస్టేట్' వ్యాపారంతో కోటీశ్వరులైన వారు ఎందరో! దీర్ఘకాలంలో ఆ వ్యాపారం సృష్టించే సంపద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కళ్ల ముందే భూమి, ప్రాపర్టీ రేట్లు అమాతం పెరిగిపోతున్నా.. డబ్బు లేక వెనకడుగు వేసే సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. అయితే.. ఈ కష్టాలేవీ లేకుండా తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. మంచి లభాలు పొందే ఆప్షన్ ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని మీకు తెలుసా? అదే.. 'ఆర్ఈఐటీ'!
స్టాక్ మార్కెట్లో 'రియల్ ఎస్టేట్' వ్యాపారం..!
REIT investment : ఆర్ఈఐటీ అంటే.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఈ ట్రస్ట్‌లో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌కు అనేక ఆస్తులు ఉంటాయి. ఇలా ఉన్న ఆస్తుల్లో ఎక్కువగా కమర్షియల్ కాంప్లెక్సులు ఉంటాయి. వాటి నుంచి రెంట్లు వస్తూ ఉంటాయి.
ఆర్ఈఐటీలో ఓ స్పాన్సర్ ఉంటారు. అతను వివిధ ఆస్తులను కొనుగోలు చేసి, వాటిని ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. ఆ ట్రస్ట్‌లో పెట్టుబడులు పెట్టినవారికి ఆ ఆస్తుల వల్ల ఆదాయం వస్తూ ఉంటుంది.
ఈ ఆర్ఈఐటీని.. మ్యూచ్యుఫల్ ఫండ్స్‌తో పోల్చి చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. చాలా మంది పెట్టుబడిదారులు ఒక చోట చేరి, పెట్టుబడులు పెడితే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. పెట్టుబడులు పెడితే, వారికి స్టాక్స్ వస్తాయి. ఆర్ఈఐటీలు కూడా ఇంతే. అందులో పెట్టుబడులు పెడితే.. కొన్ని 'యూనిట్స్' వస్తాయి.
ఈ ఆర్ఈఐటీ కాన్సెప్ట్ ఇండియాకు 2019లో పరిచయమైంది. ఎంబసీ పార్క్ ఆర్ఈఐటీ.. తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ, బ్రూక్‌ఫీల్డ్ ఆర్ఈఐటీలు కూడా అవతరించాయి.
REIT investment in India : ఆర్ఈఐటీల్లో డ్యురేషన్ అన్నది చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక సంస్థ.. తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలని చూస్తోంది. అందుకోసం ఒక కాంప్లెక్స్‌ను వెతుకుతోంది. ఆర్ఈఐటీ.. ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఒప్పందంలో కాలవ్యవధి కూడా కచ్చితంగా ఉంటుంది. ఆ సమయం వరకు ఆ కాంప్లెక్స్‌లో ఆ కంపెనీ.. తన కార్యాలయాన్ని నడిపించాల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధి అనేది సాధారణంగా రోజులు, నెలల్లో ఉండదు. కొన్నేళ్ల పాటు ఆ ఒప్పందం ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ విధంగా ఆర్ఈఐటికి రెంట్ల రూపంలో ఆదాయం వస్తుంది. ఆర్ఈఐటీల్లో వచ్చే ఆదాయంలో 90శాతం డివిడెండ్ల రూపంలో పెట్టుబడిదారులకు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
లాభం ఇలా..
ఈ ఆర్ఈఐటీ సంస్థలు.. ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం అవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజలు.. ఆ ఆర్‌ఈఐటీలను సాధారణ స్టాక్స్లాగే కొనుగోలు చేసుకుని తమ పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఆర్ఈఐటీల్లో మొత్తం రిటర్నులు.. ఏడాదికి 12-20శాతంగా ఉండే అవకాశం ఉంది.
వాస్తవ రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్నా.. ఆర్ఈఐటీలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. అదే సమయంలో రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. పైగా.. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుండటం వల్ల.. వాటిని సెబీ రెగ్యులేటరీగా ఉంటోంది. అందువల్ల మదుపర్లకు మరింత రక్షణ లభిస్తోంది.
REIT investment options in India : బయట ఒక రియల్ ఎస్టేట్ ఆస్తిని అమ్మడానికి చాలా సమయం పడుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఆర్‌ఈఐటీలను సెకన్లలో విక్రయించవచ్చు!
ఆర్ఈఐటీ షేర్లను రూ. 500(అంతకన్నా తక్కువ) పెట్టి కొనుగోలు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఆస్తులను ఎప్పుడైనా అంత తక్కువ డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయగలిగారా?
ఆర్ఈఐటీల్లో పెట్టుబడులతో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి! ఆర్ఈఐటీల ద్వారా వచ్చిన డివిడెండ్లలో 90శాతం ట్యాక్స్ ఫ్రీ! అయితే దీనిపై ఈ ట్యాక్స్ నిపుణులతో మాట్లాడాల్సి ఉంటుంది.
రెంటల్ ఆదాయం డివిడెండ్ల రూపంలో వస్తుండటంతో పాటు.. సంబంధిత స్టాక్స్ పెరుగుతుంటే.. అది కూడా పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టినట్టే కదా.
సాధారణంగా.. స్టాక్ మార్కెట్లో 'డైవర్సిఫికేషన్' అన్న పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల మదుపర్లకు ఆర్ఈఐటీ అనేది మంచి ఆప్షన్.
పెట్టుబడి పెట్టే ముందు ఇవి తెలుసుకోండి..
- ఆక్యుపెన్సీ పర్సెంటేజ్:- ట్రస్ట్‌లో ఉన్న ఆస్తుల్లో ఎంత మొత్తం రెంట్‌కి ఉందనేది తెలుసుకోవాలి. ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంత రెంట్లు వస్తాయి.. అంత మంచిది.
- టెనెంట్ క్వాలిటీ:- ఐటీ, ఫార్మా వంటి సెక్టార్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల ఆయా రంగాల్లోని కంపెనీలు ఎక్కువ కాలం ఒకే చోట ఉండొచ్చు! ఫలితంగా వెకెన్సీ రిస్క్ అనేది తగ్గుతుంది. బిజినెస్ బాగా సాగుతుంటే.. రెంట్ కూడా సమయానికి వస్తూ ఉంటుంది.
- REIT companies in India : టెనెంట్ సంఖ్య:- అద్దెకు తీసుకునేవారు ఎంత ఎక్కువమంది ఉంటే.. పెట్టుబడిదారులకు అంత మంచిది. తక్కువ మంది టెనెంట్లు ఎక్కువ స్థలాన్ని తీసుకోవడం కన్నా.. ఎక్కువ మంది టెనెంట్లు, తక్కువ స్థలంలో ఉండటంతో రిస్క్ తగ్గుతుంది. ఒకరు, ఇద్దరు వెకేట్ చేసినా.. పెద్ద సమస్య ఉండదు.
- భౌగోళిక ప్రాంతాలు:- ఆర్ఈఐటీ ఆస్తులు ఏ నగరాల్లో, ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమం. అప్పుడే అక్కడి 'గ్రోత్'పై అంచనా వేసుకోవచ్చు.
- డివిడెండ్ యీల్డ్:- ఇది ఎంత ఎక్కువ ఉంటే.. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో అంత బలంగా ఉన్నట్టు.
- రెవన్యూ/ ప్రాఫిట్స్:- సాధారణంగా స్టాక్స్ ప్రదర్శను పీఈ వాల్యూతో చూస్తూ ఉంటారు. కానీ ఈ ఆర్‌ఈఐటీలకు అలా కుదరదు. వీటిని రెంటల్ ఆదాయంలో వృద్ధి, పోర్ట్‌ఫోలియో వాల్యూ, ప్రాఫిట్లలో వృద్ధి వంటి పారామీటర్లతో లెక్కించాల్సి ఉంటుంది.
- డబ్ల్యూఏఎల్ఈ:- డబ్ల్యూఏఎల్ఈ అంటే.. వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ. టెనెంట్లు ఇంకెంతకాలం ఆ ప్రాపర్టీల్లో ఉంటారు? అనేది ఇది సూచిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. వేకెన్సీ రిస్క్ అంత తక్కువగా ఉంటుంది.
ఈ 'రిస్క్'లు కూడా ఉన్నాయి..
- వేకెన్సీ లాస్:- టెనెంట్లు ఖాళీ చేసినప్పుడు.. రెంట్లు సరిగ్గా రావు. మరో టెనెంట్‌ను వెతుక్కోవాలి. అప్పటివరకు ప్రాపర్టీ ఖాళీగా ఉంటుంది.
- ఇండియాలో తక్కువే:- ఆర్ఈఐటీ ఆప్షన్లు ఇండియాలో తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మూడే లిస్ట్ అయ్యాయి. అందువల్ల పెట్టుబడిదారులకు పెద్దగా ఆప్షన్లు లేవు.
చివరిగా..
Stock market real estate : పెట్టుబడుల విషయంలో అందరికి కొన్ని గోల్స్ ఉంటాయి. ఆర్ఈఐటీపై సరిగ్గా రీసెర్చ్ చేసిన తర్వాతే.. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.