తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సీయూఈటీ యూజీ ఫలితాల జాప్యంతో విసిగిపోతున్న విద్యార్థులు; ఎన్టీఏ హెల్ప్ లైన్ కు ఫోన్స్

సీయూఈటీ యూజీ ఫలితాల జాప్యంతో విసిగిపోతున్న విద్యార్థులు; ఎన్టీఏ హెల్ప్ లైన్ కు ఫోన్స్

HT Telugu Desk HT Telugu

25 July 2024, 14:21 IST

google News
    • సీయూఈటీ యూజీ ఫలితాల విడుదలలో జాప్యంతో విసిగిపోయిన విద్యార్థులు సమాధానాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హెల్ప్ లైన్ కు ఫోన్లు చేస్తున్నారు. సీయూఈటీ యూజీ (CUET-UG) ఫలితాల జాప్యంతో అడ్మిషన్ ప్రక్రియకు ఇబ్బంది కలుగుతోంది.
సీయూఈటీ యూజీ ఫలితాల జాప్యంతో విసిగిపోతున్న విద్యార్థులు
సీయూఈటీ యూజీ ఫలితాల జాప్యంతో విసిగిపోతున్న విద్యార్థులు

సీయూఈటీ యూజీ ఫలితాల జాప్యంతో విసిగిపోతున్న విద్యార్థులు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG) ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో.. విసిగిపోయిన విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హెల్ప్ లైన్ కు ఫోన్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ సీయూఈటీ యూజీ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు నిర్వహిస్తారు.

సెంట్రల్ యూనివర్సిటీల్లో..

అత్యంత డిమాండ్ ఉన్న ఢిల్లీ విశ్వవిద్యాలయంతో సహా 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లకు సీయూఈటీ-యూజీ ప్రాధమిక ప్రవేశ పరీక్షగా పనిచేస్తుంది. సీయూఈటీ యూజీ ఫలితాలను ప్రకటించడంలో జాప్యం కారణంగా ఆయా విద్యా సంస్థల అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం పడుతోంది.

మే 15 నుంచి పరీక్షలు

ఈ ఏడాది సీయూఈటీ యూజీ (CUET-UG 2024) పరీక్షలను మే 15 నుంచి 31 వరకు ఆన్ లైన్, పెన్ అండ్ పేపర్ ఫార్మాట్లలో నిర్వహించారు. ఆ తరువాత, జూలై 19న రీటెస్ట్ నిర్వహించారు. ఈ జాప్యంతో 13 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎన్టీఏ ఫలితాల విడుదలలో జాప్యంపై సీయూఈటీకి హాజరైన పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.

ఎన్టీఏ రెస్పాన్స్

సీయూఈటీ యూజీ కి హాజరైన ఓ విద్యార్థి ఎన్టీఏ (NTA) హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫలితాల టైమ్ లైన్ పై స్పష్టత కోరారు. ఆ తరువాత ఎన్టీఏ సమాధానాన్ని వివరిస్తూ, రెడిట్ లో ఒక పోస్ట్ రాశారు. తనకు సమాధానం ఇచ్చిన ప్రతినిధి తీరుకు ముగ్డుడినయ్యానని, కానీ తనకు స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదని ఆ స్టూడెంట్ చెప్పారు. ‘‘ఆ ప్రతినిధి రెస్పాన్స్ చూసి నిజంగా ఇంప్రెస్ అయ్యాను. కాల్ కు త్వరగా స్పందించి సంయమనంతో బదులిచ్చాడు. వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డు లింకులను తొలగించారని, అంటే త్వరలోనే ఫలితాలను అప్లోడ్ చేయవచ్చని ఆ ప్రతినిధి చెప్పాడు. కానీ ఎప్పుడు రిజల్ట్స్ ను ప్రకటిస్తారో స్పష్టత మాత్రం ఇవ్వలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వారం ఫలితాలను ఆశించవచ్చా అని విద్యార్థి అడిగినప్పుడు, ఆ ఎన్టీఏ ప్రతినిధి "వేచి చూడు" అని సమాధానమిచ్చాడట. రెగ్యులర్ గా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేస్తుండమని సలహా కూడా ఇచ్చాడట. సీయూఈటీ యూజీ రాసిన మరో విద్యార్థి కూడా ఎన్టీఏ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. తుది ఆన్సర్ కీ ఇంకా విడుదల కాలేదని, ఆన్సర్ కీ విడుదల అయిన మూడు, నాలుగు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని అతడికి సమాధానం వచ్చింది.

అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET-UG 2024) ఫలితాల ప్రకటనలో జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో అడ్మిషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ఫలితాల ప్రకటనలో జాప్యంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యను కొనసాగించడానికి కళాశాలల్లో చేరాలని ఎదురు చూస్తున్న విద్యార్థి వర్గాల్లో ఆందోళన నెలకొంది. సీయూఈటీ యూజీ 2024 ఫలితాల ప్రకటనతో ప్రారంభం కావాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు అయోమయానికి గురవుతున్నారు. సీయూఈటీ స్కోర్ కార్డు అవసరం లేని కాలేజీల కోసం విద్యార్థులు వెతకడం ప్రారంభించారు.

తదుపరి వ్యాసం