Pet dog stories: పెంపుడు కుక్క నిర్వాకం; పవర్ బ్యాంక్ ను కొరకడంతో నిప్పురవ్వలు ఎగిసి ఇల్లంతా తగలబడింది..
08 August 2024, 22:28 IST
Pet dog stories: బ్యాటరీలను ఇంట్లో సురక్షితంగా ఉంచడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి. ఓక్లహోమా (USA) లోని తుల్సాలోని ఓ ఇంట్లో పెంపుడు కుక్క మొబైల్స్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే లిథియం అయాన్ పవర్ బ్యాంకును కొరకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి, ఇల్లే తగలబడిపోయింది.
పవర్ బ్యాంక్ ను కొరికి ఇంటిని తగలబెట్టిన పెంపుడు కుక్క
Pet dog stories: పెంపుడు కుక్క అక్షరాలా తానుంటున్న ఇంటినే తగులబెట్టిందన్న వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకుంటున్నవారికి కొత్త భయం ప్రారంభమైంది. ఓక్లహోమా (USA) లోని తుల్సాలోని ఒక ఇంట్లో పెంపుడు కుక్క మొబైల్స్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ పవర్ బ్యాంకును కొరకడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు ప్రారంభమై, ఇల్లు తగలబడిపోయింది.
పవర్ బ్యాంక్ ను కొరికి..
ఆ ఇంట్లో పెంపుడు శునకం లివింగ్ రూమ్ లోని పరుపుపై హాయిగా కూర్చుంది. అక్కడే మరో కుక్క, పిల్లి ఉన్నాయి. పరుపుపై పడి ఉన్న పవర్ బ్యాంక్ ను ఆ కుక్క కొరికింది. దాంతో, ఆ పవర్ బ్యాంక్ లో నుంచి నిప్పు రవ్వలు వచ్చాయి. దాంతో, భయపడి ఆ పెంపుడు జంతువులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వెంటనే పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మండే స్వభావం ఉన్న పరుపుపై ఉండడంతో పవర్ బ్యాంక్ నుంచి మంటలు వేగంగా వ్యాపించి ఇల్లును తగలబెట్టేశాయి.
లిథియం అయాన్ బ్యాటరీలతో జాగ్రత్త
లిథియం అయాన్ బ్యాటరీలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ తుల్సా అగ్నిమాపక శాఖ ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకుంది. అదృష్టవశాత్తూ, ఆ రెండు కుక్కలు, పిల్లి ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాయి. కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. అయితే ఈ ఘటన తర్వాత ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
పెంపుడు జంతువులతో జాగ్రత్తలు
మీ ఇంట్లో పెంపుడు జంతువులు లేదా పిల్లలు ఉంటే, బ్యాటరీతో నడిచే అన్ని గాడ్జెట్లను వారికి అందుబాటులో ఉంచకూడదు. లిథియం-అయాన్ బ్యాటరీలు పేలుడు స్వభావం కలిగి ఉంటాయి. వాటిని పెంపుడు జంతువులకు, పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. పెంపుడు జంతువులు ఇంట్లో ఉన్నవారు బ్యాటరీలు ఉన్న టీవీ లేదా ఏసీ రిమోట్లను పట్టించుకోకుండా నేలపై వదిలివేయవద్దు. స్మార్ట్ వాచ్ లు, ఫిట్నెస్ బ్యాండ్ లు, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ వంటి చిన్న గాడ్జెట్లను ఎల్లప్పుడూ ఇంట్లో సురక్షితంగా ఉంచాలి. పిల్లలకు వాటిని దూరంగా ఉంచాలి. ఉపయోగించడం లేని పాత పరికరాలు లేదా బ్యాటరీలను రీసైక్లింగ్ కేంద్రంలో సురక్షితంగా పారవేయడం మంచిది.