Ratan Tata: ముంబై తాజ్ హోటల్ లో వీధి శునకం; రతన్ టాటా పై నెటిజన్ల ప్రశంసల వర్షం-ratan tatas strict instructions dog sleeps peacefully inside taj mahal hotel ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ratan Tata: ముంబై తాజ్ హోటల్ లో వీధి శునకం; రతన్ టాటా పై నెటిజన్ల ప్రశంసల వర్షం

Ratan Tata: ముంబై తాజ్ హోటల్ లో వీధి శునకం; రతన్ టాటా పై నెటిజన్ల ప్రశంసల వర్షం

HT Telugu Desk HT Telugu
May 29, 2024 02:45 PM IST

ముంబైలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో తాజ్ మహల్ హోటల్ ఒకటి. టాటా గ్రూప్ నకు చెందిన ఈ హోటల్ ముంబైలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. వీవీఐపీలు బస చేసే ఈ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఒక వీధి శునకం హాయిగా నిద్రిస్తున్న ఫొటో వైరల్ గా మారింది. దీనిపై రతన్ టాటాకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ స్టోరీ ఏంటో ఇక్కడ చూడండి.

ముంబైలోని తాజ్ హోటల్ ఎంట్రన్స్ వద్ద నిద్రిస్తున్న శునకం
ముంబైలోని తాజ్ హోటల్ ఎంట్రన్స్ వద్ద నిద్రిస్తున్న శునకం (LinkedIn/Rubi Khan)

Ratan Tata news: ఇటీవల ముంబైలోని తాజ్ మహల్ హోటల్ లో బస చేసిన ఓ హెచ్ ఆర్ ప్రొఫెషనల్ రూబీ ఖాన్ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ప్రశాంతంగా నిద్రిస్తున్న కుక్కను చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ ఉన్న సిబ్బందిని ఆ లగ్జరీ హోటల్ ముందు వీధి శునకం హాయిగా సొంత ఇంటిలా పడుగుకుని ఉండడంపై ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

రతన్ టాటా ఆదేశాలు..

పుట్టినప్పటి నుంచి ఆ కుక్క ఈ హోటల్ లోనే పెరుగుతోందని తాజ్ హోటల్ సిబ్బంది ఆమెకు చెప్పారు. ఈ హోటల్ ఆవరణలోకి వచ్చే జంతువులను బాగా చూసుకోవాలని రతన్ టాటా కఠినమైన ఆదేశాలు జారీ చేశారని సిబ్బంది వివరించారు. ఆ విషయం విన్న రూబీ ఖాన్ ఆశ్చర్య పోయారు. ఈ విషయాన్ని వివరిస్తూ, రతన్ టాటా సహృదయతపై లింక్డ్ ఇన్ లో ఒక పోస్ట్ ను ఆమె షేర్ చేశారు. ‘‘ ముంబై (mumbai)లో రాజకీయ ప్రముఖుల నుండి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల వరకు అనేక మంది అతిథులకు నిలయమైన ఈ ప్రదేశం (తాజ్ మహల్ హోటల్), దాని గోడల మధ్య ఉన్న ప్రతి ప్రాణికి విలువ ఇస్తుంది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థ ప్రవేశ ద్వారం వద్ద హాయిగా నిద్రిస్తున్న ఈ శునకాన్ని చూడండి.ఈ గందరగోళం మధ్యనే ఈ శునకం తన సురక్షిత ఇంటిని ఏర్పర్చుకుంది ’’ అని ఆమె పోస్ట్ చేశారు. ‘‘మీరు అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్త కావచ్చు, కానీ అది ప్రతి ఒక్కరినీ గౌరవించడానికి, ఆలింగనం చేసుకోవడానికి అది అడ్డంకిగా మారకూడదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. చాలా మంది నెటిజన్లు రతన్ టాటా (Ratan Tata) మంచితనాన్ని, నిరాడంబరతను, సహృదయతను కొనియాడారు. ఈ పోస్ట్ కు వేలల్లో వ్యూస్, వందల్లో లైక్స్ అండ్ కామెంట్స్ లభించాయి. తాజ్ హోటల్ కూడా దీనిపై స్పందిస్తూ.. ‘‘హాయ్ రూబీ, ఈ కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు. తాజ్ లో మేము ప్రతి అతిథి తన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి పొందేలా చూస్తాము’’ అని వ్యాఖ్యానించింది. ‘‘వాహ్ తాజ్ బోలియే (వావ్ తాజ్ అనండి)’’ అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.