Supreme Court on Taj Mahal case: తాజ్ మహల్.. అందానికి నిలువెత్తు నిర్వచనం. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. తాజాగా, తాజ్ మహల్ పై కూడా వివాదాలు ప్రారంభమయ్యాయి.
తాజ్ మహల్ లో 22 రహస్య గదులు ఉన్నాయని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని, అందువల్ల ఆ రహస్య గదులను తెరవాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గతంలో తాజ్ మహల్ ఒక శివాలయమని, దాని పేరు తేజో మహాలయ అని పిటిషనర్ అయిన ఒక దంత వైద్యుడు రజినీశ్ వాదించాడు. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడనడానికి శాస్త్రీయ ఆధారాలు కావాలని కోరాడు.
ఈ పిటిషన్ ను ఈ మే నెలలో విచారించిన అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. అనవసరంగా, కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని, ఇది విచారణార్హం కాదని మండిపడింది. పిల్ అంటే ప్రచార ప్రయోజన వ్యాజ్యం కాదని, పిల్ ను అపహస్యం చేయవద్దని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దాంతో పిటిషనర్ రజినీశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం ఆ దావాను కొట్టివేస్తూ, పిటిషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు సరిగ్గానే స్పందించిందని, ఇది ప్రచారం కోసం వేసిన పిటిషనేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి అనవసర ప్రచారాల కసం పిల్ వేసి కోర్టు విలువైన సమయం వృధా చేయొద్దని హెచ్చరించింది.