Ratan Tata: ఐదో దశ లోక్ సభ పోలింగ్ ముందు ముంబై వాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం; క్షణాల్లో వైరల్ గా మారిన పోస్ట్
Ratan Tata: 2024 లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 20వ తేదీ, సోమవారం జరగనుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరగనుంది. వాటిలో ముంబైలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదో దశ పోలింగ్ ముందు ముంబైవాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Ratan Tata's X post: ముంబైలోని అన్ని లోక్ సభ స్థానాలకు మే 20 సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ బిగ్ డేకు ముందు ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైకర్లతో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రతన్ టాటా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ సందేశం అత్యంత తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.
ఓటు హక్కు వినియోగించుకోండి..
ఐదో దశ పోలింగ్ సందర్భంగా ముంబైలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రతన్ టాటా ఆ ఎక్స్ పోస్ట్ లో ముంబై వాసులను అభ్యర్థించారు. ‘‘ముంబైలో సోమవారం పోలింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని కోరుతున్నాను’’ అని రతన్ టాటా తన పోస్టులో పేర్కొన్నారు. ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్ లోని ఆరు లోక్ సభ స్థానాలకు ఈ ఐదో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
వైరల్ గా పోస్ట్
షేర్ చేసినప్పటి నుంచి రతన్ టాటా చేసిన ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. గంటలోనే ఇది 30,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. అలాగే, ఈ పోస్ట్ కు దాదాపు 3,800 లైక్స్ వచ్చాయి.నెటిజన్లు దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ షేర్ పై స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు రతన్ టాటా పోస్టును రీపోస్ట్ కూడా చేశారు.
నెటిజన్ల స్పందన
మే 20 ముంబై లోని అర్హులైన ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ రతన్ టాటా ఎక్స్ లో చేసిన పోస్ట్ పై నెటిజన్లు ప్రేమగా స్పందిస్తున్నారు. రతన్ టాటా పోస్ట్ పై ఒక యూజర్.. ‘‘చాలా ప్రేమ, సర్’’ అని పోస్ట్ చేశాడు. ‘‘ముంబైవాసులందరూ స్థిరత్వం, శ్రేయస్సు, సమానత్వం కోసం తమ ఓటు శక్తిని ఉపయోగిస్తారు’’ అని మరొక యూజర్ రియాక్ట్ అయ్యారు. ‘‘మీలాంటి వ్యక్తి ఉండడం భారతదేశం చేసుకున్న చాలా గొప్ప అదృష్టం సార్’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ముంబై ప్రజలకు మీరు చేసిన విజ్ఞప్తి దేశ ప్రయోజనాలకు ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ దేశ సంక్షేమానికి దోహదం చేస్తారు’’ అని మరొకరు కామెంట్ చేశాడు. మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఐదో దశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.