Honda Civic into Lamborghini : హోండా సివిక్ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్- నెటిజన్లు ఫిదా!
Honda Civic into Lamborghini : గుజరాత్‌కు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ తన కస్టమ్ లంబోర్ఘినిని 2008 హోండా సివిక్ తో ఒక సంవత్సరం పాటు నిర్మించాడు. దీనికి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు.
Modified Lamborghini : లంబోర్ఘినిని కొనడం ఖచ్చితంగా చాలా మందికి ఒక కల! అయితే.. గుజరాత్‌కు చెందిన యూట్యూబర్ తన్నా ధవల్.. తన కొత్త లంబోర్ఘిని సూపర్ కారును ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే.. నిజానికి అది లంబోర్ఘిని కాదు! 2008 హోండా సివిక్ని లంబోర్ఘినిగా మార్చేశాడు. ఇందుకు రూ. 12.5 లక్షలు మాత్రమే ఖర్చు చేశాడట. సాధారణంగా.. లంబోర్ఘిని ధర రూ. కోట్లల్లో ఉంటుంది. ఈ వార్త వింటున్న నెటిజన్లు వావ్ అంటున్నారు.
టెర్జో మిలెనియో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్ఫూర్తితో హోండా సివిక్‌ను లాంబోర్ఘినిగా మార్చే ప్రయాణాన్ని ధవల్ తన యూట్యూబ్ ఛానెల్లో డాక్యుమెంట్ చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్‌ని పూర్తి చేసేందుకు అతనికి ఏడాది సమయం పట్టింది! మాడిఫైడ్ కారు వీల్ ఆర్చ్‌లు, ట్విన్ డోర్లు, పొడవైన విండ్ స్క్రీన్‌తో పాటు మరెన్నో కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. ఇప్పుడు కొత్త తరం లంబోర్ఘిని కార్లలో భాగమైన సిగ్నేచర్ ట్రై-ఎల్ఈడీ డిఆర్ఎల్స్ని కూడా పునరావృతం చేశాడు.
Honda Civic into Lamborghini : కస్టమ్-బిల్ట్ కారుకు చాలా ఇతర భాగాలు, ఇంటెన్సివ్ ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ అవసరమని ధవల్ వెల్లడించాడు. కొత్త డిజైన్‌కు సరిపోయేలా సివిక్‌పై ఛాసిస్ కట్ చేసి రీడిజైన్ చేయాల్సి వచ్చింది. దీనికి రూ .1 లక్షకు పైగా ఖర్చు అయ్యింది. కేవలం లేబర్ ఛార్జీలకే మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు ధవల్ చెప్పాడు. చాలా భాగాలను కస్టమ్ ఫ్యాబ్రికేట్ చేశాడు. గాజు భాగాలను బ్లాక్ ఫిల్మ్‌తో యాక్రిలిక్ షీట్లతో భర్తీ చేశాడు. మాడిఫై చేసిన కారు కిటికీలను తెరవడం సాధ్యం కాదు!
ఈ మాడిఫైడ్ లంబోర్ఘిని తలుపులపై '63' స్టిక్కర్ కూడా ఉంది. ఇది లంబోర్ఘిన్ పుట్టిన సంవత్సరం '1963'ను సూచిస్తుంది. బానెట్, వీల్స్‌పై లంబోర్ఘిని రేజింగ్ బుల్ లోగోను కూడా జత చేశాడు. క్యాబిన్లో స్పోర్ట్స్ సీట్లు, కొత్త అప్‌హోలిస్ట్రీ, ఫ్లాట్-బాటమ్ స్పోర్టీ స్టీరింగ్ వీల్, వైడ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి మార్పులు ఉన్నాయి. కీ ఫోబ్ కూడా కస్టమ్-బిల్ట్ చేయడం జరిగింది. కొత్త బీఎమ్‌డబ్ల్యూ మోడళ్ల మాదిరిగానే స్మాల్ స్క్రీన్‌ను పొందుతుంది.
Honda Civic to Lamborghini : ప్రాజెక్ట్ కారు ఇంజిన్‌లో మార్పు ఉందా లేదా అనే విషయాన్ని కంటెంట్ క్రియేటర్ వెల్లడించలేదు. 2008 హోండా సివిక్ లో 1.8-లీటర్ ఐ-వీటీఈసీ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్‌తో ఉండేది.
ఈ ప్రాజెక్టును ఇంటర్నెట్ లో ఔత్సాహికులు ప్రశంసించారు. చూసినవారందరు వావ్ అంటున్నారు. యూట్యూబర్ కృషిని మెచ్చుకుంటున్నారు.
సంబంధిత కథనం