Pushpa 2 : పుష్ప 2 ఆడుతున్న థియేటర్లోకి దూసుకెళ్లిన పోలీసులు- షాక్‌లో ప్రేక్షకులు! అసలేం జరిగిందంటే..
22 December 2024, 13:40 IST
Pushpa 2 screening : నాగ్‌పూర్‌లో పుష్ప 2 ఆడుతున్న ఓ థియేటర్లో షాకింగ్ ఘటన జరిగింది! సినిమా ప్లే అవుతుండగా కొందరు పోలీసులు లోపలికి దూసుకొచ్చి, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అది చూసిన ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు!
పుష్ప 2 ఆడుతున్న థియేటర్లోకి దూసుకెళ్లిన పోలీసులు
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో 'పుష్ప 2' అర్థరాత్రి షోను వీక్షిస్తున్న సినీ ప్రేక్షకులకు షాక్ ఎదురైంది! సినిమా ప్లే అవుతుండగా, బయట నుంచి పోలీసులు ఒక్కసారి లోపలికి దూసుకొచ్చారు. అనంతరం హత్య, మాదకద్రవ్యాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
పుష్ప 2 ఆడుతున్న థియేటర్లో నుంచి గురువారం అర్ధరాత్రి విశాల్ మెష్రామ్ అనే డ్రగ్ స్మగ్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని పట్టుకుని తీసుకెళుతూ.. ఇక సినిమాను ఆస్వాదించవచ్చని పోలీసులు ప్రేక్షకులకు హామీ ఇచ్చారు.
10 నెలలుగా పరారీలో ఉన్న మెష్రామ్ ఇటీవల విడుదలైన పుష్ప 2ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నట్లు పచ్పౌలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. గ్యాంగ్ స్టర్‌పై రెండు హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా 27 కేసులు ఉన్నాయని, ఇతను హింసాత్మక వైఖరికి పేరుగాంచాడని, గతంలో పోలీసులపై కూడా దాడి చేశాడని వివరించారు.
సైబర్ నిఘాను ఉపయోగించి కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ)లో అతని కదలికలను ట్రాక్ చేస్తూ అధికారులు గాలించారు. గురువారం మెష్రామ్ని ట్రాక్ చేసిన పోలీసులు అతను తప్పించుకోకుండా ఉండేందుకు నగరం నడిబొడ్డున ఉన్న సినిమా హాలు వెలుపల వాహనం టైర్లలో గాలిని తీసేశారు.
మెష్రామ్ సినిమాలో లీనమైన అనంతరం పోలీసులు హాల్లోకి ప్రవేశించారు. ప్రతిఘటించే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అతడిని చుట్టుముట్టి వేగంగా అరెస్టు చేశారు.
ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న మెష్రామ్ని త్వరలోనే నాసిక్‌లోని జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
పుష్ప 2 చూద్దాం అంటే ఒప్పుకోలేదని..
అల్లు అర్జున్ నటించి పుష్ప 2 చుట్టూ ఈ మధ్య చాలా వార్తలు వస్తున్నాయి. సినిమా చూద్దాం అంటే బాయ్‌ఫ్రెండ్ వద్దన్నాడన్న కారణంతో ఓ యువత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో బుధవారం జరిగింది ఈ ఘటన. ఝార్ఖండ్ ధనబాద్కి చెందిన ఆ ఇద్దరు ట్రిప్ కోసం వారణాసి వెళ్లారు. ఆ 22ఏళ్ల యువతి బీహెచ్‌యూకు అనుసంధానమైన కాలేజ్‌లో చదువుకుంది. కాగా.. కాన్వొకేషన్లో పాల్గొనేందుకు తన బాయ్‌ఫ్రెండ్ కలిసి నగరానికి వెళ్లింది. 23ఏళ్ల ఫుర్ఖన్తో కలిసి ఒక హోటల్లో ఆమె ఉంది. పుష్ప 2 సినిమాకి వెళదామని ఆమె, తన బాయ్‌ఫ్రెండ్‌ని అడిగింది. అందుకు అతను ఒప్పుకోలేదు. ఆమెకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.