Pushpa 2 Row : తప్పదు పుష్పా.. ఇకనుంచి తగ్గాల్సిందే.. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా?
22 December 2024, 9:44 IST
- Pushpa 2 Row : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి.. ఏపీ, తెలంగాణ రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. ఇన్నాళ్లు ఏపీపై సినిమా వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్రమంగా తెలంగాణలో పెరుగుతోంది. అందుకే ఏ ప్రభుత్వం ఏర్పడినా.. సినిమా ఇండస్ట్రీ జోలికి పోరు అనే టాక్ ఉండేది. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీన్ మారింది. తొలుత ఫ్రెండ్లీగా ఉన్నా అప్పటి సీఎం కేసీఆర్.. ఆ తర్వాత కాస్త ఘలక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం, తెలంగాణ రాజకీయాలపై సినిమా వాళ్ల కామెంట్స్ తగ్గాయి.
జగన్ సీఎం అయ్యాక..
2019 తర్వాత ఏపీలో జగన్ సీఎం అయ్యాక.. సినిమా మొత్తం మారిపోయింది. గతంలో మాదిరిగా సెలబ్రెటీలు ప్రభుత్వాలపై కామెంట్స్ చేయలేదు. కనీసం మాట్లాడాలంటే భయపడేవారు. ఇటీవల చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో.. ఇండస్ట్రీకి బలం, గొంతు పెరిగినట్టు అయ్యింది. కానీ అది ఏపీ వరకే పరిమితం అనే విషయాన్ని సెలబ్రెటీలు మర్చిపోయారు.
ఆశ్చర్యకరంగా ఇండస్ట్రీ తీరు..
తాజాగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతిచెందింది. మరో బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనే అయినా.. సినిమా ఇండస్ట్రీ తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడే ప్రభుత్వానికి కోపం వచ్చింది.
వ్యవస్థలపై కామెంట్స్..
మహిళ చనిపోయిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. రూల్స్ ప్రకారం అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్, ఆ వెంటనే బెయిల్ వచ్చింది. అయితే.. జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్ను సినిమా పరిశ్రమ వారు వరుసగా ఇంటికెళ్లి పరామర్శించారు. నాని లాంటి వాళ్లు ఓ అడుగు ముందుకేసి.. ప్రభుత్వం, పోలీస్, మీడియా వ్యవస్థలను విమర్శిస్తూ పోస్టు చేశారు. ఇదే బాటలో మరికొందరు నడిచారు. కానీ.. బాధిత కుటుంబాన్ని ఎవ్వరూ పరామర్శించలేదు. ఈ విమర్శలు పెరగడంతో.. అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్ చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
రేవంత్ సీరియస్..
అయితే.. ఘటన జరిగినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సెలబ్రెటీలు, ప్రముఖులు అయితే.. నిబంధనలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ హీరో అయితే.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌కు పరామర్శలు ఎందుకు.. ఆయనకు కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. ఏమైందని ప్రశ్నించారు.
సీఎం ఏమన్నారు..
'సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది' అని రేవంత్ వివరించారు.
'ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా.. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు' అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఎందుకు పరామర్శించలేదు..
'దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యతారహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు' అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగానికి లోబడే..
'అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే.. పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే... తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం.. సినీ, సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది' అని సీఎం స్పష్టం చేశారు.
ఆటలు సాగవు..
'జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు' అని స్పష్టం చేశారు. ఇకపై బెన్ఫిట్ షోలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేవంత్ చేసిన ఈ కామెంట్స్.. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కానీ.. చాలామంది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను, చర్యలను సమర్థిస్తున్నారు. సినిమా వాళ్లు అయితే.. ఏం చేసినా కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. తప్పుదు పుష్పా.. ఇకనుంచి తగ్గాల్సిందేనని సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.