Supreme Court : సీజేఐగా డీవై చంద్రచూడ్ తుది తీర్పు ఇదే.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్
CJI DY Chandrachud : సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే సీజేఐగా చంద్రచూడ్ తుది తీర్పును బుల్డోజర్ చర్యపై ఇచ్చారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ విరమణకు ముందు ఆదివారం తుది తీర్పు వెలువరించారు. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. చంద్రచూడ్ తుది నిర్ణయం బుల్డోజర్ జస్టిస్‌కు వ్యతిరేకంగా ఉంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ శాఖలు సరైన చట్టపరమైన ప్రక్రియ లేకుండా ప్రజల వ్యక్తిగత ఆస్తులను కొల్లగొట్టే వ్యవస్థతో ముందుకెళ్లడంపై సీజేఐ మాట్లాడారు.
సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుల్డోజర్ చర్యపై తీర్పునిచ్చింది. జస్టిస్ జేబీ . పర్దివాలా, మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. జర్నలిస్ట్ మనోజ్ తిబ్రేవాల్ పూర్వీకుల ఇంటిని 2019లో కూల్చివేసిన కేసు ఇది. దీనికి సంబంధించిన విషయాన్ని బహిరంగ ప్రకటనను ద్వారా మాత్రమే చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లిఖితపూర్వక నోటీస్ గానీ, చట్టపరమైన ఆధారాలను గానీ స్పష్టంగా పేర్కొనలేదని తెలిపింది.
2019లో యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగిన బుల్డోజర్ చర్యపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కేవలం బహిరంగ ప్రకటన మాత్రమే చేశారని పేర్కొంది. 'ఎందుకు ఈ చర్య తీసుకున్నారో లిఖితపూర్వక నోటీసు కూడా ఇవ్వలేదు. ఇది న్యాయ ప్రక్రియలను ఉల్లంఘించడమే. ఈ కేసులో పిటిషనర్‌కు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. అక్రమ కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.' అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
బుల్డోజర్ న్యాయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని సీజేఐ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. దీన్ని అనుమతిస్తే.. రాజ్యాంగంలోని ఆస్తి హక్కు(సెక్షన్ 300ఏ)కు ఉన్న గుర్తింపు ముగిసిపోతుందని సీజేఐ అన్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఏ నాగరిక న్యాయవ్యవస్థలోనూ బుల్డోజర్ల ద్వారా న్యాయం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనిని అనుమతిస్తే రాష్ట్రంలోని ఏ అధికారి లేదా శాఖ అయినా పౌరుల ఆస్తులను కూల్చివేయడం ద్వారా అనవసరమైన ప్రతీకార రూపం తీసుకోవచ్చని తెలిపారు.
ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా పౌరుల గొంతు నొక్కలేమని డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అధికారులకు ప్రజల జవాబుదారీతనం ప్రామాణికంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన లేదా మంజూరు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ శిక్షలు అనుభవించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ బుల్డోజర్ చర్యపై తన తుది తీర్పులో కీలక కామెంట్స్ చేశారు.
2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. న్యాయస్వేచ్ఛను, పౌరహక్కులను పరిరక్షించడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి ఆయన అనేక ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు. చట్టపరమైన ప్రక్రియలను, పౌరుల హక్కులను పరిరక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటారని చెప్పేందుకు సీజేఐగా ఆయన ఇచ్చిన తుది తీర్పే ఉదాహరణ. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.