CJI DY Chandrachud: ‘‘ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’: సీజేఐ డీవై చంద్రచూడ్
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. నవంబర్ 8, 2024 ఆయన చివరి వర్కింగ్ డే. ఈ సందర్భంగా ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు.‘ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’ అని ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 8, శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన వీడ్కోలు ప్రసంగంలో.. తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన వినమ్రంగా కోరారు.
వీడ్కోలు ప్రసంగం
‘‘ఈ కోర్టే నన్ను ముందుకు నడిపించింది. ఇక్కడ మనకు తెలియని వ్యక్తులను కలుస్తాం. మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ప్రతీ కేసు ప్రత్యకమే. ఒక కేసును పోలిన కేసు మరొకటి ఉండదు. నేను కోర్టులో, విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, దయచేసి నన్ను క్షమించాలని నేను కోరుతున్నాను. సీజేఐగా నా చివరి ప్రసంగానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ తన వీడ్కోలు ప్రసంగంలో పేర్కొన్నారు.
తాత్విక ప్రసంగం
రెండేళ్ల క్రితం నవంబర్ లో దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ చంద్రచూడ్ 2016 మేలో సుప్రీంకోర్టు (supreme court) న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తన వీడ్కోలు ప్రసంగంలో జస్టిస్ చంద్రచూడ్ ‘మనమంతా ఈ భూమి పైకి యాత్రికులుగా, పక్షుల్లాగా వచ్చాం. మనకు అప్పగించిన పని పూర్తి కాగానే వెళ్లిపోతాం’’ అని తాత్వికంగా వ్యాఖ్యానించారు. తన వారసుడు జస్టిస్ ఖన్నా గురించి సీజేఐ చంద్రచూడ్ (CJI DY Chandrachud) మాట్లాడుతూ ఆయన చాలా స్థిరమైన, దృఢమైన, గౌరవప్రదమైన వ్యక్తి అని కొనియాడారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశంసలు
జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మాసనానికి తదుపరి సీజేఐగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహించారు. తన ముందు సీజేఐ గా విధులు నిర్వర్తించిన జస్టిస్ చంద్రచూడ్ నుంచి తానెంతో నేర్చుకున్నానని జస్టిస్ ఖన్నా అన్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024, నవంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.