Manipur horror: ‘‘మీరు చర్యలు తీసుకుంటారా? మేం రంగంలోకి దిగాలా?’’ - మణిపూర్ ఘటనపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం
Manipur horror: మణిపూర్ లో ఇద్ధరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన సిగ్గు చేటు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Manipur horror: మణిపూర్ (Manipur) లో ఇద్ధరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన సిగ్గు చేటు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలన్నారు. మణిపూర్ లోని కంగ్ కోక్పి జిల్లా ఫైనామ్ గ్రామంలో ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు నగ్నంగా రోడ్డుపై నడిపించారు. ఆ అసహాయ మహిళలు వదిలేయాలని వేడుకుంటున్నా కనికరించలేదు. ఈ ఘటన మే 4వ తేదీన జరగగా.. సంబంధిత వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM Responds to Manipur horror: దోషులను వదలం
‘ నా హృదయం బాధ, ఆవేదన, కోపంతో నిండిపోయింది. మణిపూర్ లో జరిగిన ఘటన ఏ నాగరిక సమాజానికైనా సిగ్గు చేటు. ఆ మహిళలపై జరిగిన దారుణానికి దేశమంతా సిగ్గుతో తలదించుకుంటోంది. దోషులను వదిలిపెట్టబోమని నేను హామీ ఇస్తున్నా. మహిళలపై నేరాలకు సంబంధించి విధించే శిక్షలను మరింత కఠినం చేసేలా చట్టాలు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నా’ అని మోదీ పేర్కొన్నారు.
CJI warns Government: మీరు చర్యలు తీసుకుంటారా? మేం రంగంలోకి దిగాలా?
ఇద్ధరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సుమోటో గా తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా దోషులను పట్టుకుని చట్టం ముందు నిలపని పక్షంలో, తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఇది దారుణమైన రాజ్యాంగ ఉల్లంఘన. జాతి విద్వేషాలకు మహిళలను పావులుగా వాడుకుని, వారిని అవమానించడం అమానుషం. ఆ వీడియోపై మేం ఎంతో ఆవేదన చెందుతున్నాం. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే, మేం రంగంలోకి దిగి, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ హెచ్చరించారు.
ఉరిశిక్ష పడేలా చూస్తాం..
రాష్ట్రంలో ఇద్ధరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులకు మరణ శిక్ష పడేలా చూస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు గురువారం వెల్లడించారు.