Kejriwal ki Guarantee : ‘ఉచిత విద్యుత్.. ఉచిత విద్య’- ప్రజలపై కేజ్రీవాల్ హామీల వర్షం!
12 May 2024, 14:30 IST
Kejriwal ki Guarantee : అరవింద్ కేజ్రీవాల్.. 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. భారతదేశంలోని అందరికీ ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆప్ నేతలు..
Arvind Kejriwal 2024 Lok Sabha elections : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. మంచి జోరు మీద ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్న ఆయన.. తాజాగా, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీకి ధీటుగా.. ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో.. ప్రజలపై హామీల వర్షాన్ని కురిపించారు.
ఈ హామీలు నవ భారతానికి విజన్ అని.. అవి లేకుండా దేశం శక్తిమంతంగా మారదని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ 10 హామీలు..
1. 24 గంటల విద్యుత్ సరఫరా: తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది.
2. విద్యా సంస్కరణలు: దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్యను అందిస్తూ, నాణ్యతలో ప్రైవేటు సంస్థలను అధిగమించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాము.
3. హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్: ప్రతి గ్రామం, ప్రాంతంలో మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేస్తాము. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలుగా అప్‌గ్రేడ్ చేస్తాము.
4. జాతీయ భద్రత: చైనా ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి, ప్రాదేశిక సమగ్రత కోసం దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగించడానికి సైన్యానికి పూర్తి స్వయంప్రతిపత్తిని కల్పిస్తాము.
2024 Lok Sabha elections Delhi : 5. అగ్నివీర్ స్కీమ్ నిలిపివేత: అగ్నివీర్ పథకాన్ని నిలిపివేసి, నమోదైన పిల్లలందరినీ శాశ్వత పదవుల్లో క్రమబద్ధీకరిస్తాము. ఒప్పంద వ్యవస్థను రద్దు చేస్తాము. సైన్యానికి తగినన్ని నిధులు వచ్చేలా చూస్తాము.
6. రైతు సంక్షేమం: స్వామినాథన్ నివేదిక ఆధారంగా పంటలకు న్యాయమైన పరిహారం అందించి రైతులు గౌరవప్రదమైన జీవనం సాగించేలా చూస్తాము.
7. దిల్లీకి రాష్ట్ర హోదా: తమ ప్రభుత్వం దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తుందు, ఇది నగరవాసుల చిరకాల కోరిక అని కేజ్రీవాల్ ఆయన అన్నారు.
8. ఉపాధి కల్పన: నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఇండియా కూటమి ప్రభుత్వం.. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.
9. అవినీతి నిర్మూలన: బీజేపీ రక్షణాత్మక చర్యలను తొలగించి, అందరికీ జవాబుదారీతనాన్ని కల్పించడం ద్వారా అవినీతిని రూపుమాపుతాము.
10. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రమోషన్: పీఎంఎల్ఏ నిబంధనల నుంచి జీఎస్టీని తొలగిస్తాము. తయారీ రంగంలో చైనాను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
ప్రజల చూపు ఎటువైపు..?
2024 Lok Sabha elections : దిల్లీ ప్రజలను అంచనా వేయడం చాలా కష్టం! అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని భారీ మెజారిటీతో గెలిపించే దిల్లీ ఓటర్లు.. కేంద్రం విషయానికి వచ్చేసరికి, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా.. మే 25న దిల్లీలో పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు వెలువడతాయి. మరి కేజ్రీవాల్ కీ గ్యారంటీలను ప్రజలు ఆమోదించారో లేదో ఫలితాల ద్వారా తెలిసిపోతుంది.