CM Revanth Reddy : ఫాంహౌస్ మత్తులో నిరుద్యోగులను నిర్లక్ష్యం,ఉద్యోగాలు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు-సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy handing over appointment letters to newly recruited ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఫాంహౌస్ మత్తులో నిరుద్యోగులను నిర్లక్ష్యం,ఉద్యోగాలు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు-సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఫాంహౌస్ మత్తులో నిరుద్యోగులను నిర్లక్ష్యం,ఉద్యోగాలు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు-సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Mar 04, 2024 08:03 PM IST

CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమంలో యువ‌త ముందుండి పోరాడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు ఫాంహౌస్ మ‌త్తులో ఉండి ల‌క్షలాది యువ‌కుల ఆకాంక్షలను నెర‌వేర్చడంలో విఫ‌ల‌మ‌య్యారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్, మెడికల్ ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... ఎల్‌బీ స్టేడియం చ‌రిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల‌కు ఉచిత క‌రెంటు, రైతుల‌పై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేస్తూ మొద‌టి సంత‌కం చేసి మ‌న ప్రాంతంలో రైతును రాజును చేస్తూ పునాది ప‌డ్డది ఈ ఎల్‌బీ స్టేడియంలోనే అన్నారు. 2023 డిసెంబ‌రు 7 తేదీన కాంగ్రెస్ (Congress)అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో మ‌రోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదే స్టేడియంలో అభ‌య‌హ‌స్తం పేరిట ఆరు గ్యారెంటీల అమ‌లుకు సంత‌కం చేశామన్నారు. మూడు నెల‌ల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే సంత‌కాలు పెట్టామన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువ‌త ముందుండి పోరాడిందన్న సీఎం..... కొంద‌రు ఆత్మబ‌లిదానాలు చేసుకొని అమ‌రులై తెలంగాణ సాధించారన్నారు.

విద్యపై పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడి

ఆ బ‌లిదానాల‌తో సాధించిన తెలంగాణ‌లో నాటి ప్రభుత్వం వారి స్ఫూర్తిని ప‌ని చేయాల్సింది పోయి.. వాళ్ల లాభార్జన‌, వారి ధ‌న‌దాహం తీర్చుకోవ‌డానికే ప‌ని చేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. ఫాంహౌస్ మ‌త్తులో వారు ఉండి ల‌క్షలాది యువ‌కుల ఆకాంక్షలను నెర‌వేర్చడంలో విఫ‌ల‌మ‌య్యారన్నారు. త‌ల్లిదండ్రులు గ్రామాల్లో రూపాయి రూపాయి కూడ‌బెట్టి మిమ్మల్ని కోచింగ్ సెంట‌ర్లకు(Coaching Centers) పంపితే గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రశ్నాప‌త్రాలు జిరాక్స్ సెంట‌ర్లలో దొరికేవని ఆరోపించారు. నిరుద్యోగ యువ‌త ముందుకు వ‌చ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడ‌గొట్టడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నియామ‌కాలు చేప‌డుతుందన్నారు. విద్యపై పెట్టే ఖ‌ర్చు ఖ‌ర్చు కాదు.. పెట్టుబ‌డి.. భ‌విష్యత్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇంధనం అన్నారు.

నాకు ఇంగ్లిష్ రాదు

"మీ ఉద్యోగాల‌తో(Jobs) తెలంగాణ‌కు అఖిల భార‌త స్థాయి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌ల‌ను, డాక్టర్లు, ఇంజినీర్లను త‌యారు చేసే బాధ్యత‌ను మీరు చేప‌ట్టబోతున్నారు. స‌ర్పంచులు మొద‌లు ప్రధాన‌మంత్రి వ‌ర‌కు త‌యారు చేసే బాధ్యత మీదే. నేను కూడా ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుకున్నాను. నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానంటే నాడు ప్రభుత్వ పాఠ‌శాల‌లో అందించిన విద్యే కార‌ణం. నేను గుంటూరులోనో, గుడివాడ‌లోనో చ‌దువుకోలేదు. కొంద‌రు నాకు ఇంగ్లిష్ రాద‌ని అవ‌హేళ‌న చేస్తున్నారు. చైనా, జ‌పాన్‌, జ‌ర్మనీలో వారికి ఇంగ్లిష్ రాదు. కానీ ప్రపంచంతోనే పోటీప‌డే అభివృద్ధి, ఉత్పత్తుల‌ను ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లిష్ అనేది ఓ భాష‌, ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నేడు ప్రపంచంలో ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చే ఇంగ్లిషును నేర్పండి. మీ ద‌గ్గర చ‌దువుకునే పిల్లల‌కు ఇంగ్లిష్ రాదని అవ‌హేళ‌న చేసే ప‌రిస్థితి రావ‌ద్దు. మీ ద‌గ్గర చదువుకునే పిల్లల‌కు మంచి భాష‌ను, భావాన్ని దేశ‌భ‌క్తిని నేర్పండి. వారే రేప‌టి పాల‌కులు అవుతారు. రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌లు ఇచ్చామ‌ని గ‌త పాల‌కులు చెబుతున్నారు. వాటిలో ఎక్కడైనా మౌలిక వ‌స‌తులు క‌ల్పించారా? అందుకే మోడ‌ల్ గురుకుల పాఠ‌శాల తీసుకురావాల‌ని రూ.25 ఎక‌రాల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నాం" - రేవంత్ రెడ్డి

Whats_app_banner

సంబంధిత కథనం