కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో ఇదే అతి పెద్ద గెలుపు-telangana elections results this is the biggest victory for congress in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Elections Results This Is The Biggest Victory For Congress In Telangana

కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో ఇదే అతి పెద్ద గెలుపు

HT Telugu Desk HT Telugu
Dec 03, 2023 06:12 PM IST

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఇదే అతిపెద్ద గెలుపు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ గెలుపోటములపై విశ్లేషణ.

కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌దే పూర్తి ఆధిప‌త్యం. తెలుగుదేశం ఆవిర్భావం త‌ర్వాత దానికి గండి పడింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ భాగంగా ఉన్న‌ప్పుడు, ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు (1989 ఎన్నిక‌లు మిన‌హా) తొలిసారి అతి పెద్ద గెలుపు తాజా ఎన్నిక‌ల్లో ద‌క్కింది. 

ట్రెండింగ్ వార్తలు

1983 వ‌ర‌కు తెలంగాణ ప్రాంతంలో మ‌ర్రి చెన్నారెడ్డి, జ‌ల‌గం వెంగ‌ళ‌రావు, ఆర్గుల రాజారాం, నూకల రామ‌చంద్రారెడ్డి వంటి హేమాహేమీలైన నేత‌లు ఉండడం, మ‌రే పార్టీ నుంచి ప్ర‌తిఘ‌ట‌న లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ హ‌వా న‌డిచేది. 

దిగ్గ‌జ సినీ న‌టుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన త‌ర్వాత 1983లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రాజ‌యం పాలైంది. తెలంగాణ ప్రాంతంలో నాడు 107 శాస‌న‌స‌భ స్థానాలు ఉండగా కాంగ్రెస్‌కు కేవ‌లం 43 స్థానాలు (40.18 శాతం) మాత్ర‌మే ద‌క్కాయి. తెదేపా, వామ‌ప‌క్షాలు మిగ‌తా స్థానాలు ద‌క్కించుకున్నాయి. 

1985 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీట్లు 14కు ప‌రిమితం కాగా, 1989లో 58 స్థానాలు ద‌క్కించుకుంది. త‌ర్వాత వ‌రుస‌గా 1994లో 6, 1999లో 42, 2004లో 48 స్థానాలు మాత్ర‌మే కాంగ్రెస్‌కు ద‌క్కాయి. 

2009కు ముందు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో తెలంగాణ‌లో శాస‌న‌స‌భ స్థానాల సంఖ్య 119కు పెరిగింది. 2009లో కాంగ్రెస్‌కు 50 స్థానాలు ద‌క్క‌గా, ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 21, 2018 ఎన్నిక‌ల్లో 19 స్థానాల్లోనే కాంగె్ర‌స్ గెలిచింది.

ప్రత్యేక తెలంగాణలో

1983 నుంచి 2014 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిప‌త్యం ఉండ‌డంతో పాటు కాంగ్రెస్ లో హేమాహేమీలైన నాయ‌కులు ఉండ‌డంతో త‌క్కువ స్థానాలే గెలిచినా రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ త‌ట్టుకొని నిల‌బడింది. కానీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్‌కు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. 

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర‌ప‌రాజ‌యం పాలుకావ‌డంతో తెలంగాణ ఇచ్చిన పేరు ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం 21 శాస‌న‌స‌భ స్థానాల‌కే కాంగ్రెస్ ప‌రిమిత‌మైంది. గెలిచిన 21 మందిలో ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ (నాడు టీఆర్ ఎస్‌) లో చేర‌గా... ఇద్ద‌రు ఎమ్మెల్యేలు చ‌నిపోవ‌డంతో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఓట‌మిపాల‌య్యారు. 

2018 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో తెదేపా, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జ‌న‌స‌మితిల‌తో క‌లిసి కాంగ్రెస్ బ‌రిలో దిగింది. ఒక ద‌శ‌లో గెలుస్తుంద‌ని భావించినా చేదు అనుభ‌వ‌మే మిగిలింది. కేవ‌లం 19 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. 

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మూడు సీట్ల‌తోనే స‌రిపెట్టుకోవ‌డం, బీజేపీ నాలుగు స్థానాలు గెల‌వ‌డంతో రాష్ట్రంలో మూడో స్థానంలోకి పార్టీ ప‌డిపోయింది. మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్య‌క్షునిగా నియ‌మించిన త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో వేగం పుంజుకుంది. 

హుజూరాబాద్‌, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్‌, హుజూర్ న‌గ‌ర్‌, మునుగోడు ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ పార్టీ ఓట‌మిపాలైనా ఎక్క‌డా ఆ ప్ర‌భావం క‌నిపించ‌నివ్వ‌కుండా రేవంత్ త‌ర‌చూ భారీ స‌భ‌లు, ర్యాలీలతో ఊపు తీసుకువ‌చ్చారు. దానికి రాహుల్ గాంధీ జ‌రిపిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌భావం తోడ‌యింది. అధికార పార్టీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను కాంగ్రెస్‌కు అనుకూలంగా మ‌ల్చుకోవ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. ఫ‌లితంగా 1983 త‌ర్వాత తొలిసారిగా కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ సీట్లు సాధించింది.

(1983 నుండి 2004 వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాస‌న‌స‌భ స్థానాలు 107)

ఎన్నిక‌ల సంవ‌త్సరం-కాంగ్రెస్ సాధించిన స్థానాలు

1983-43 (40.18 శాతం)

1985-14 (13.08 శాతం)

1989- 58 (54.20 శాతం)

1994-06 (5.06 శాతం)

1999-42 (39.25 శాతం)

2004-48 (44.85 శాతం)

(2009 నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాస‌న‌స‌భ స్థానాలు 119)

2009-50 (42.01 శాతం)

2014-21 (17.64 శాతం)

2018-19 (15.96 శాతం)

* కాంగ్రెస్ పార్టీ 2004లో నాటి టీఆర్ ఎస్‌, సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌గా, 2018లో తెదేపా, సీపీఐ, సీపీఎంల‌తో క‌లిసి బ‌రిలో దిగింది.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీపీఐతో జ‌త క‌లిసి బ‌రిలో దిగింది.

2023-64 (53.78 శాతం)

WhatsApp channel