Women's Day | మహిళలకు మగవారి కంటే కుక్కలపైనే ఎక్కువ మక్కువట.. ఎందుకంటే?!
07 March 2023, 10:33 IST
- International Women's Day 2023: ఆడవారికి పురుషులపై నమ్మకం సన్నగిల్లుతోందా? నేటి ఆధునిక కాలంలో చాలా మంది మహిళలు పెంపుడు జంతువులను పెంచుకుంటే, వాటి తోడు ఉంటే చాలని అభిప్రాయపడుతున్నారట. ఎందుకో ఈ స్టోరీ చదవండి..
Reasons why women are opting for pets over romantic partners
International Women's Day 2023: మీరు ఎప్పుడైనా గమనించారా? అమ్మాయిలు పెంపుడు జంతువులను చాలా ఇష్టపడతారు. ఇంట్లో చిన్న పిల్లిని లేదా కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. వాటిని ఎత్తుకుంటారు, ముద్దు చేస్తారు, తమతో పాటు తోడుగా తీసుకెళ్తారు, వాటిపై ఎనలేని ప్రేమను కురిపిస్తారు. అవి కూడా వారితో అలాంటి ప్రేమనే కురిపిస్తాయి. వాస్తవానికి నేటి ఆధునిక కాలంలో మహిళలు మగవారి కంటే పెంపుడు జంతువులనే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు ఒక సర్వే ద్వారా వెల్లడైంది. పురుష భాగస్వామితో ఉండటం కంటే ఏదైనా పెంపుడు జంతువుతోనే స్థిరపడాలని ఆ సర్వేలో ఎక్కువ మంది కోరుకున్నారట. ఇందుకు కారణాలు లేకపోలేదు.
నేడు ఏ సంబంధం సంతోషంగా కొనసాగడం లేదు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ, నమ్మదగిన, ఆధారపడదగిన, ప్రేమగల భాగస్వామిని కనుగొనడంలో అనిశ్చితి పెరుగుతుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మొదట్లో ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ, కొన్నాళ్లు గడిచేసరికి బాధాకరంగా విడిపోయే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా దూరం అయ్యే పురుష భాగస్వామికి బదులుగా ఒక కుక్కను పెంచుకోవడం మేలు అని స్త్రీలు భావిస్తున్నారట. ఎలాంటి సందర్భంలో అయినా కుక్కలు ఎంతో ఆప్యాయత, ప్రేమను చూపుతాయి. ముఖ్యంగా అవి ఒక వ్యక్తిపై ఎంతో విశ్వసనీయతను కలిగి ఉంటాయి. ఇవి పురుషులలో లోపించడం వలనే స్త్రీలు కుక్కలపై మక్కువ చూపుతున్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జస్ట్‌డాగ్స్ సహ వ్యవస్థాపకురాలు పూర్వి ఆంథోనీ HT డిజిటల్‌తో మాట్లాడుతూ.. ఎక్కువ మంది మహిళలు తమ జీవితంలో రొమాంటిక్ భాగస్వామికి బదులుగా పెంపుడు జంతువును ఎందుకు ఎంచుకోవడం చేస్తున్నారో వివరించారు. వారి ప్రకారం, మహిళల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
ఈ సంబంధంలో ఎటువంటి చిక్కులు లేవు
ఒక మనిషితో సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా అనేక సమస్యలు రావచ్చు, హృదయ విదారకమైన అవకాశాలను తీసుకురావచ్చు, పెంపుడు జంతువు ప్రేమ ఎల్లప్పుడూ వెలకట్టలేనిది. వీటితో ఎలాంటి విభేదాలు ఉండవు, ఇవి తమను ఎల్లప్పుడూ ఇష్టపడతాయే తప్ప బాధపెట్టవు. వీటి నిస్వార్థమైన ప్రేమ కారణంగా మహిళలు పెంపుడు జంతువులతో సంబంధాన్ని ఎంచుకుంటున్నారు.
వాటి ప్రేమ షరతులు లేనిది
బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్‌లు వచ్చి పోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత కూడా వారు విడిపోవచ్చు. కానీ మీరు మీ పెంపుడు జంతువుతో పంచుకునే బంధం శాశ్వతంగా ఉంటుంది. పెంపుడు జంతువుల ప్రేమ మనుషల వలె ఎలాంటి షరతులను విధించదు. మనుషులు మనసులను విచ్ఛిన్నం చేస్తారు, విడిచిపెట్టి పోతారు. కానీ పెంపుడు జంతువు ఎప్పటికీ అలా చేయదు. అది మీ నుండి ప్రేమ తప్ప మరేమీ కోరుకోదు, మీరే వాటి ప్రపంచం.
కట్టుబాట్లు అవసరం లేదు
రోజులో కాస్త ఎక్కువ పనిచేసి ఇంటికి ఆలస్యంగా వచ్చినా, వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా తప్పుపట్టడం ఉండదు. ఎప్పుడు వచ్చినా పెంపుడు కుక్క మనకోసం ఎదురుచూస్తూ రాగానే ప్రేమగా దగ్గరకు వస్తాయి. ఎలాంటి దుస్తులు ధరించినా, ఎలాంటి నడవడికతో ఉన్న పెంపుడు జంతువులు అన్నింటినీ స్వాగతిస్తాయి. వాటితో ఎలా మాట్లాడినా, తిట్టినా తిరిగి ప్రేమనే చూపుతాయి.
ఈ కారణాల చేతనే అమ్మాయిలు పెంపుడు జంతువుల పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇవి మాత్రమే తమను సరిగ్గా అర్థం చేసుకుంటున్నాయి అనే భావన వారిలో మొదలైంది.