Husband Wife Relationship | భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే నలుగురిలో నవ్వుల పాలు అవ్వాల్సిందే!
25 December 2022, 20:10 IST
- Husband Wife Relationship: చాలా సందర్భాల్లో భార్యభర్తలు విడిపోయేది వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడమే. ఈ నియమాలు పాటిస్తే మీ వైవాహిక జీవితంలో సంతోషం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Husband Wife Relationship
Husband Wife Relationship: బంధాలు, బంధుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ పాలునీళ్లలా కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తలది. కొన్నిసార్లు ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు రావడం సహజం, అటువంటి పరిస్థితుల్లో కొంత సమయం తీసుకొని మీకు మీరుగా సమస్యను పరిష్కరించుకోవడం ముఖ్యం. చాలా సందర్భాల్లో ఏ జంట మధ్య అయినా మూడో వ్యక్తి ప్రవేశంతోనే గొడవలు పెద్దగా మారతాయి. కఠిన పరిస్థితులు ఎదురైనపుడు తనలో సగం అనుకున్న అర్ధాంగి మరొకరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఏ భర్తకు ఇష్టం ఉండదు. అదే సమయంలో పరాయి వ్యక్తుల ముందు తన భార్యను చులకనగా చేసి భర్త మాట్లాడటం ఏ భార్యకు నచ్చదు. ఇటువంటి సమయంలో మూడో వ్యక్తి ఒకరివైపు మాట్లాడటం చేస్తే వారి మధ్య అగాథం మరింత పెరుగుతుంది. అందరూ మేలు కోరేవారే అయి ఉండరు. మన మంచి కోరి మాట్లాడుతున్నట్లు అనిపించినా తమ స్వార్థం కోసం అవకాశం కోసం ఎదురుచూసే వారే ఎక్కువ. చివరకు నలుగురిలో నవ్వుల పాలే అయ్యేది భార్యాభర్తలే అని గ్రహించాలి.
ఏ జంట మధ్య అయినా బంధం పదిలంగా ఉండాలంటే వారిద్దరూ కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడం ఒకరి పని మాత్రమే కాదు. రెండు చేతులు కలిపితే చప్పట్లు మోగుతాయి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ వారి సంతోషకరమైన దాంపత్యం కోసం కష్టపడాలి. ఈ చిట్కాలు పాటించండి.
ఫిర్యాదులు చేయవద్దు
భర్త ఏదైనా చిన్న మాట అనగానే కొంతమంది ఆడవారు తమ పుట్టింటి వారికి ఫిర్యాదు చేసేస్తారు. ఆమెకు సంబంధించిన వారు ఇంటికి వస్తే అతిగా స్పందించడం చేస్తారు. దానికి వారు ప్రతిస్పందించే విధానాన్ని బట్టి గొడవలు పెరగవచ్చు. దీనివల్ల భర్తకు తన భార్యపై చెడు అభిప్రాయం కలుగుతుంది. అలాగే ఇల్లు విడిచి తన కోసం వచ్చిన భార్య మంచిచెడులు చూసుకోవడం భర్త బాధ్యత. తనది పైచేయి కావడం కోసం అనవసరపు పెత్తనం చెలాయించడం లేదా తన భార్యను కంట్రోల్‌లో ఉంచుతున్నట్లు ప్రవర్తించడం వలన మీ బంధంలో ప్రేమ నశిస్తుంది. ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఇద్దరూ సంయమనం పాటించాలి.
గౌరవం ఇచ్చిపుచ్చుకోండి
భార్యభర్తలు ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకోవడంలో తప్పులేదు. కానీ ఇంటికి ఎవరైనా వచ్చినపుడు లేదా మీరు మరొక చోటికి కలిసి వెళ్లినప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం చేస్తే మంచిది. బదులుగా వేరొకరి ముందు సరదాగా విమర్శించినా అది కొన్నిసార్లు తప్పుడు అర్థాన్ని సూచిస్తుంది. అది మీ భాగస్వామిని ఒత్తిడికి గురిచేస్తుంది, చిన్నచిన్న ప్రశంసలు చేసుకోండి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేలా వ్యవహరించాలి.
భాగస్వామితో మాట్లాడండి
మీ భాగస్వామి కారణంగా మీరు నొచ్చుకొని ఉంటే లేదా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించి ఉంటే మనసులోనే దాచుకోకూడదు. అది నెమ్మదిగా అపనమ్మకానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఏ వ్యక్తి అయినా తమ తప్పును గ్రహించలేరు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ భాగస్వామి ఈ స్వభావం గురించి మాట్లాడటం మంచిది. ఇలాంటి అతి ఉత్సాహం వలన ఇంటి వాతావరణంపై చెడు ప్రభావం పడుతుందని వారికి తెలియజేయండి.
అవగాహన కలిగి ఉండండి
కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన మీ భాగస్వామిని సపోర్ట్ చేయడం కుదరకపోవచ్చు. వారికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సి రావచ్చు. విషయం మీరు నేరుగా చెప్పలేనపుడు, దూరంగా వెళ్లి ఒక కాల్ చేసి స్వేచ్ఛగా మాట్లాడండి. విషయాలను అర్థం అయ్యేలా చెప్పండి, ఇద్దరూ ఒక ఏకాభిప్రాయానికి రావాలి. ఇలాంటి అవగాహన భార్యభర్తల మధ్య ఉంటే, మూడో వ్యక్తికి అవకాశం లభించదు.
మరొకరితో పోల్చుకోకూడదు
ఎవరి జీవితం వారిదే, అందరికీ అన్నీ లభించవు. లేదా లభించేందుకు సమయం పడుతుంది. గొప్పగా ఎదిగేందుకు మార్గదర్శనం చేయడం మంచిదే కానీ, వేరొకరిని పోల్చి చూపుతూ భాగస్వామిని ఒత్తిడికి గురి చేయవద్దు. అలాగే మీరు మీ భాగస్వామికి ఇంతకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చడం చాలా ముఖ్యం. అన్నీ చేయలేకపోయినా, కొన్ని అయినా నెరవేర్చాలి. లేదా చేసిన వాగ్ధానాలను నెరవేర్చడానికి మీరు చిత్తశుద్ధితో ఉన్నట్లు వారికి తెలియజేయండి.
చివరగా, చెప్పేదేమిటంటే ఒకరినొకరు నిందించుకోవడం వలన మీ గొడవలతో మరొకరు ప్రయోజనం పొందుతారు కానీ, మీకు లభించేది శూన్యం. కాబట్టి మీ మధ్య గొడవలు జరిగినపుడు మూడో వ్యక్తిని సహాయం కోరకుండా కొంత సమయం పాటు వేచి చూడండి. దేనికైనా పరిష్కారం లభిస్తుంది.