Lying in Relationship | మీ జీవిత భాగస్వామికి ఈ 5 అబద్ధాలు చెప్పారో విడాకులే!
Lying in Relationship: అబద్ధాలతో పెళ్లిళ్లు జరుగుతాయి, అవే అబద్ధాలతో పెళ్లిళ్లు పెటాకులు కూడా అవుతాయి. అయితే ఓ 5 అబద్ధాలు చెబితే బంధాలు తెగిపోతాయట. అవేంటో తెలుసుకోండి మరి.
వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు. కానీ అవే అబద్ధాలు బంధాలలో చీలిక తెస్తాయంటున్నారు నిపుణులు. ఏ బంధాలైనా నమ్మకంపైనే నిలబడతాయి. ఒకరి మీద నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండటం ముఖ్యం. పవిత్రమైన వివాహ బంధంలో ఉన్నపుడు ఎలాంటి దాపరికలకు, అబద్ధాలకు తావుండకూడదు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నప్పుడు ప్రతీసారి నిజం చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు అబద్ధం చెప్పడమే ఆ సందర్భానికి సరైన నిర్ణయం. కొన్ని అబద్ధాలు అందంగా కూడా ఉంటాయి. అబద్ధంతో మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడం మంచిదే కానీ, అబద్ధాలతోనే బంధాలు కలుపుకోవడం, అబద్ధపు ప్రేమలో మెలగటం సరైనది కాదు అనేది నిపుణుల వాదన. అబద్ధంతో ఆ క్షణంలో ప్రేమను పొందవచ్చు, కానీ నిజం తెలిసిన నాడు ఆ బంధం బీటలు వారడం ఖాయం. అబద్ధాలు చెబుతూ బంధాలను కొనసాగించడం ఎదుటి వారిని మోసం చేయడమే. అందుకే పెద్దలు అంటారు బంధాలు ఏర్పరుచుకోవడం సులభమే, కానీ ఆ బంధాన్ని కడదాకా కొనసాగించడం చాలా కష్టం అని.
Lying in Relationship - ఈ 5 అబద్ధాలు చెబితే బంధం తెగిపోతుంది
మీ రిలేషన్‌షిప్‌ను దృఢంగా మార్చుకోవడానికి పొరపాటున కూడా మీ జీవిత భాగస్వామికి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, అవి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెడతాయి. ముఖ్యంగా ఈ 5 అబద్ధాలు మీ జీవిత భాగస్వామికి అస్సలు చెప్పకూడదు. చెబితే మీ బంధంలో చీలిక వచ్చి విడిపోతారట. ఆ అబద్ధాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
అబద్ధం నెంబర్ 1
మీ మాజీ ప్రియుల గురించి అబద్ధాలు చెప్పకూడదు. మీ మాజీ ప్రియులు లేదా మాజీ భార్యతో సన్నిహితంగా ఉండటం మీ వ్యక్తిగతం కావచ్చు, కానీ మీ ప్రస్తుత భాగస్వామి వద్ద ఈ సత్యాన్ని దాచడం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. అది చివరకు విడిపోవడానికి దారితీస్తుంది.
అబద్ధం నెంబర్ 2
అబద్ధపు భావోద్వేగాలు చూపొద్దు, లేని ప్రేమను నటించవద్దు. మీ భాగస్వామితో కలిసి జీవిస్తున్నప్పుడు ప్రేమ లేకున్నా ప్రేమిస్తున్నట్లుగా, గొడవలు జరుగుతున్నా ఆనందంగా ఉంటున్నట్లుగా భావోద్వేగాలను నటిస్తే, అది కృత్రిమంగా ఉంటుంది. మీకు వారంటే ఇష్టం లేకున్నా బలవంతంగా కాపురం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీంతో మీ బంధం మరింత బలహీనమవుతుంది.
అబద్ధం నెంబర్ 3
మీ సంపాదన ఎంతనేది దాచినా పర్వాలేదు కానీ, మీరు చేసే వృత్తి గురించి అబద్ధం చెప్పకూడదు. మీరు మీ భాగస్వామితో మీ ఉద్యోగం ఒకటి చెప్పి, మీరు చేసే పని వేరొకటి అయితే.. అది తెలిసిన నాడు మీకు ఉంటుంది, ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏం ఉండదు.
అబద్ధం నెంబర్ 4
నిజం కాని నిజం చెప్పడం, పూటకో మాట మాట్లాడటం మంచిది కాదు. ఇది మీరు వారిని మోసం చేస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది. మీపై అనుమానాలు పెరుగుతాయి. మీ భాగస్వామికి ఒక విషయం, వేరొకరికి అదే విషయాన్ని ఇంకోలా చెప్పడం చేయవద్దు. అసలు విషయం మీ భాగస్వామికి తెలిసినపుడు మీపై నమ్మకం పోతుంది.
అబద్ధం నెంబర్ 5
అబద్ధపు వ్యక్తిత్వం కనబరచడం, మీరు మంచివాళ్లుగా నటించడం చేయవద్దు. మీ వ్యక్తిత్వం ఎలాంటిది, అది మంచైనా.. చెడైనా మీ భాగస్వామికి మీరు ఏమిటి, మీ నిజస్వరూపం ఏమిటి అనేది ముందునుంచే తెలిసి ఉండాలి. వ్యక్తిత్వాన్ని అబద్ధం చేస్తే, మీకు తిరిగి అదే లభిస్తుంది. అది విడిపోవటానికి దారితీయవచ్చు.
సంబంధిత కథనం