Women's Day 2023 : మహిళలకు 5 ప్రాథమిక హక్కులు.. అందరూ తెలుసుకోవాల్సిందే
05 March 2023, 11:01 IST
- Basic Rights For Women : మహిళల స్థితిగతులను బలోపేతం చేయడానికి, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి భారత రాజ్యాంగంలో మహిళలకు కొన్ని హక్కులు ఉన్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
International Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మహిళలు సమాజంలో అంతర్భాగంగా ఉన్నారు. దేశ నిర్మాణంలో అపూర్వమైన కృషి చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం స్త్రీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే వాదన ఉంది. చాలా సార్లు 'ఆమె ఒక మహిళ' అంటూ వెనక్కి నెట్టిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఎందులోనూ తక్కువ కాదు అని.. మహిళలను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి.
మహిళలకు సమాన హక్కులు, ప్రగతికి సమాన అవకాశాలు, ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు. మహిళల(Womens) స్థితిగతులను బలోపేతం చేయడానికి, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి, భారత రాజ్యాంగంలో మహిళలకు కొన్ని హక్కులు ఇచ్చారు.
సమాన వేతనం పొందే హక్కు
Right to Equal Pay : కూలీల నుంచి జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు ఒకే పనికి కూడా స్త్రీ, పురుషుల జీతాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. రాజ్యాంగం మహిళలకు సమాన వేతనం పొందే హక్కును కల్పించింది. సమాన వేతన చట్టం ప్రకారం, లింగం ఆధారంగా జీతం లేదా వేతనాలలో ఎలాంటి వివక్ష ఉండదు. సమాన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని నిబంధన ఉంది.
ప్రసూతి ప్రయోజనం పొందే హక్కు
Right to maternity benefit : ఉద్యోగం చేస్తున్న మహిళలు ప్రసూతి సంబంధిత ప్రయోజనాలు, సౌకర్యాలను పొందే హక్కును పొందుతారు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం, మహిళలు డెలివరీ తర్వాత 6 నెలల సెలవు తీసుకోవచ్చు. ఈ కాలంలో వారి జీతంలో ఎలాంటి మినహాయింపు ఉండదు. తరువాత తిరిగి పనిలో చేరే హక్కును కూడా కలిగి ఉంటారు.
పేరు, గుర్తింపును గోప్యంగా ఉంచే హక్కు
Right to keep name and identity confidential : మహిళల నేరాలకు సంబంధించి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. భారతదేశంలో లైంగిక వేధింపుల విషయంలో, బాధితురాలి పేరు, గుర్తింపును గోప్యంగా ఉంచే హక్కు ఉంది. లైంగిక వేధింపుల విషయంలో గోప్యతను కాపాడేందుకు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు ఉంటుంది. మహిళలు తమ ఫిర్యాదులను నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసుకోవచ్చు. అలాగే మహిళ ఎవరనే విషయాన్ని వెల్లడించే హక్కు పోలీసులకు, మీడియాకు, అధికారులకు లేదు.
ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు
Right to free legal aid : అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును భారత రాజ్యాంగం ఇచ్చింది. బాధిత మహిళ పోలీసు స్టేషన్‌లోని SHO నుండి సహాయం పొందవచ్చు. న్యాయవాదిని ఏర్పాటు చేయడానికి SHO చట్టపరమైన అధికారానికి తెలియజేస్తుంది.
రాత్రిపూట అరెస్టును నివారించే హక్కు
Right to avoid arrest at night : సూర్యాస్తమయం తర్వాత స్త్రీని అరెస్టు చేయరాదని చట్టం పేర్కొంది. మహిళ నేరం తీవ్రమైనదైనా, ప్రత్యేక కేసు అయినా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశం లేకుండా సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు పోలీసులు మహిళను అరెస్ట్ చేయలేరు.
టాపిక్