Instagram Hack : మైనర్‌కు లైంగిక వేధింపులు… ఏడాదిన్నర తర్వాత చిక్కిన నిందితుడు….-sleuths of cyber crimes rachakonda arrested a cyber stalker for blackmailing a minor girl ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Instagram Hack : మైనర్‌కు లైంగిక వేధింపులు… ఏడాదిన్నర తర్వాత చిక్కిన నిందితుడు….

Instagram Hack : మైనర్‌కు లైంగిక వేధింపులు… ఏడాదిన్నర తర్వాత చిక్కిన నిందితుడు….

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 08:23 AM IST

Instagram Hack ఇన్‌ స్టా గ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితుడిపై నిఘా ఉంచిన సైబర్ పోలీసులు ఏడాదిన్నర తర్వాత పట్టుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురానికి చెందిన గౌరినేని మనోజ్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించి పరారయ్యాడు. దాదాపు ఏడాదిన్నరగా అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు ఐపీ ట్రాకింగ్ ద్వారా వలపన్ని పట్టుకున్నారు.

బాలికపై వేధింపులకు పాల్పడిన గౌరినేని మనోజ్
బాలికపై వేధింపులకు పాల్పడిన గౌరినేని మనోజ్

Instagram Hack ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌ బాలికను లైంగికంగా వేధించి పరారైన నిందితుడిని సైబర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలిక ఇన్‌స్టా ఖాతాను హ్యాక్ చేసిన నిందితుడు ఆమెను నగ్నంగా వీడియో కాల్స్ చేయాలంటూ వేధించాడు. ఈ వ్యవహారంపై ఏడాదిన్నర క్రితం కేసు నమోదైంది. అప్పట్నుంచి పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించిన సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురానికి చెందిన గౌరినేని మనోజ్ బిటెక్ మూడో ఏడాదితో చదువు ఆపేశాడు. చెడు అలవాట్లకు బానిస కావడంతో తల్లిదండ్రులు చదువు మాన్పించేశారు. ఆ తరవాత పోర్న్ వీడియోలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో అమ్మాయిల పేర్లతో ఖాతాలు ప్రారంభించి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపే వాడు. ఎవరైనా వాటిని యాక్సెప్ట్‌ చేస్తే వారితో పరిచయం పెంచుకుని వేధింపులకు పాల్పడే వాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ బాలికతో ఇన్‌ స్టా గ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి చాట్ చేసేవాడు. కొన్ని రోజులకు ఆన్‌లైన్ ఫిషింగ్ లింకును పంపి ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. ఆ లింకు ద్వారా బాలికకు చెందిన ఖాతా వివరాలు, పాస్ వర్డ్‌ తెలుసుకుని, ఆ తర్వాత ఆమె ఇన్‌స్టా అకౌంట్ పాస్ వర్డ్ మార్చేశాడు. ఆ తర్వాత బాలిక ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుని వాటి కింద అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు చేశాడు.

ఈ విషయాన్ని గుర్తించిన బాలిక మనోజ్‌ను అనుమానించి, స్నేహితురాలి ఖాతా ద్వారా అతడిని సంప్రదించింది. దీంతో ఆమెను నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ వేధించాడు. వీడియో కాల్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సర్క్యులేట్ చేస్తానని బెదిరించాడు. నిందితుడి బెదిరింపులతో బాధితురాలు తండ్రికి విషయాన్ని తెలిపింది. దీంతో బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న నిందితుడు ఫోన్‌తోపాటు సిమ్ కార్డులను కాల్చేశాడు.

రాచకొండ పోలీసులు మాత్రం ఈ కేసులో నిందితుడి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇటీవల పక్కా ఆధారాలు లభించాయి. నిందితుడు వినియోగించిన ఫోన్ నంబర్లను ట్రేస్ చేసిన పోలీసులు బాలికపై వేధింపులకు పాల్పడిన ఐపీ నంబర్ల ఆధారంగా మనోజ్‌ను గుర్తించారు. నిందితుడి అచూకీ దొరికిన వెంటనే అతడిని అరెస్ట్ చేసి పోస్కో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌లను వినియోగించేటప్పుడు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెదిరింపులు, వేధింపులకు పాల్పడినా కుంగిపోకుండా పోలీసుల్ని ఆశ్రయించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫిషింగ్ లింకులను ఓపెన్ చేయకపోవడం, అపరిచితులతో చాట్ చేయడం వంటివి తగవని హెచ్చరిస్తున్నారు. వేధింపులకు గురైతే 1903కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సూచించారు.

IPL_Entry_Point

టాపిక్