తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: ఒంటి పూట భోజనంతో 2 నెలల్లో 18 కిలోలు బరువు తగ్గుదల.. ఈ పద్ధతి సేఫేనా?

Weight loss: ఒంటి పూట భోజనంతో 2 నెలల్లో 18 కిలోలు బరువు తగ్గుదల.. ఈ పద్ధతి సేఫేనా?

Galeti Rajendra HT Telugu

09 October 2024, 22:03 IST

google News
  • One Meal a Day: బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలున్నాయి. కొందరు భోజనాన్ని తగ్గిస్తే.. మరికొందరు వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఓ మహిళ ఒంటి పూట భోజనంతో బరువు తగ్గింది.  

ఒంటి పూట భోజనం
ఒంటి పూట భోజనం (Instagram/@one.mealday)

ఒంటి పూట భోజనం

రోజుకు ఒక పూట భోజనం చేయడం ద్వారా బరువులో విపరీతమైన మార్పు వస్తుందంటూ ఓ వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక మహిళ తన మునుపటి బరువు 97 కిలోలు అని.. అయితే రెండు నెలల తర్వాత తన బరువును 79 కిలోలుగా ఆ వీడియోలో చూపించింది.

తాను రోజుకు ఒక పూట భోజనం చేసే డైట్ లో ఉన్నానని ఆ మహిళ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోలో ఆమె రెండు నెలల తన డైట్‌ను కూడా షేర్ చేసింది. ‘‘97 కిలోల నుంచి 79 కిలోల వరకు.. ప్రతిరోజూ ఒక పూట భోజనం. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇది నా జీవనశైలి’’ అని ఆ మహిళ సోషల్ మీడియాలో ఆ వీడియోతో పాటు రాసుకొచ్చింది.

ఆ మహిళ వీడియో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు.. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం తినడం సురక్షితమేనా? అంటూ ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. ముంబై సెంట్రల్‌‌లోని వోక్‌హార్డ్ హాస్పిటల్స్ డైటీషియన్ అక్షతా చవాన్ ఈ విషయంపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

‘‘రోజుకు ఒక పూట మాత్రమే భోజనం తినడం ద్వారా 2 నెలల్లో 18 కిలోల బరువు తగ్గడం అనేది గణనీయమైన కేలరీల తగ్గుదలకి దారితీయవచ్చు. అందుకే కొంతమంది ఈ విధానంతో వేగంగా బరువు తగ్గడాన్ని చూస్తారు. కానీ.. ఒక పోషకాహార నిపుణుడిగా ఇలా రెండు నెలలు పాటు ఒంటి పూట మాత్రమే భోజనం చేయడాన్ని సమర్థించను. అప్పుడప్పుడు ఉపవాసల వేళ ఓకేగానీ.. మరీ 60 రోజులు అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి స్వల్పకాలికంగా బరువు తగ్గడానికి అలా ఒంటి పూట భోజనం పని చేస్తుంది. కానీ.. దీర్ఘకాలికంగా అది ప్రమాదకరం’’ అని డైటీషియన్ అక్షతా చవాన్ వెల్లడించారు.

శరీరానికి రోజువారీగా కేలరీల తీసుకోవడం చాలా ముఖ్యమని అక్షతా చవాన్ చెప్పుకొచ్చారు. ‘‘ఒంటి పూట భోజనంతో బరువు తగ్గడం అనేది కేవలం శరీరంలోని కొవ్వు మాత్రమే కాదు, కండరాల నష్టం నుండి కూడా రావచ్చు. ఇది మొత్తం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు.. రోజుకు ఒకసారి తినడం వల్ల మీకు తీవ్రమైన ఆకలి వేస్తుంది. అప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా విపరీతంగా ఉండి ఒకేసారి అతిగా తినడానికి దారితీస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది’’ అని అక్షతా చవాన్ పేర్కొన్నారు.

డైట్ విషయంలో ఇలా ఎవరైనా తీవ్రమైన మార్పులు చేసే ముందు హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ఉత్తమం అని అక్షతా చవాన్ సూచించారు.

నిరాకరణ: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీ వైద్యుడి సలహా తీసుకోండి.

తదుపరి వ్యాసం