Oats uthappam: ఓట్స్ ఊతప్పం రుచి చూశారా? తక్కువ కేలరీలతో హెల్తీ అల్పాహారం
Oats uthappam: ఓట్స్ మీ ఆహారంలో చేర్చుకోవాలి అనుకుంటే ఈ ఊతప్పం ట్రై చేయండి. తక్కువ కేలరీలు, ఎక్కువ పీచుతో ఆరోగ్యాన్నిచ్చే ఈ రెసిపీ తయారీ విధానం ఎలాగో చూసేయండి.
ఓట్స్ ఊతప్పం
ఓట్స్ అనుకోకుండా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆహారం. మన ఆహారంలో ఏదో ఒక రకంగా వీటికి చోటిస్తున్నాం. కొందరు ఓట్స్ పాలలో వేసుకుని తింటే, మరి కొందరు మసాలా ఓట్స్ తింటారు. కొందరు ఫ్రూట్స్, యోగర్ట్ వేసి పుడ్డింగ్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఓట్స్ ఊతప్పం తిన్నారా? ఇది ఉత్తమ అల్పాహారం. రుచి కూడా బాగుంటుంది. తయారీ ఎలాగో చూడండి.
ఓట్స్ ఊతప్పం తయారీకి కావల్సినవి:
అరకప్పు ఓట్స్
అరకప్పు శనగపిండి
అరకప్పు రవ్వ
అరచెంచా నిమ్మరసం
చిటికెడు బేకింగ్ సోడా
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు
1 టమాటా, సన్నటి ముక్కలు
1 క్యాప్సికం, సన్నటి ముక్కలు
4 చెంచాల కొత్తిమీర తరుగు
2 పచ్చిమిర్చి, తరుగు
2 చెంచాల నెయ్యి లేదా నూనె
అరచెంచా ఉప్పు
ఓట్స్ ఊతప్పం తయారీ విధానం:
- ముందుగా ఓట్స్ పొడిని తయారు చేయాలి. దీనికోసం ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిని జల్లిండి ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఆ పిండిలోనే రవ్వ, శనగపిండి వేసి కలపాలి.
- ఆ తర్వాత తగినంత ఉప్పు, నీళ్లు పోసుకుని కాస్త చిక్కగానే కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఎలాంటి ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
- తర్వాత 20 నిమిషాల పాటు ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి.
- పిండి నీళ్లు పీల్చుకుని కాస్త చిక్కబడుతుంది. దీంట్లో ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను వేసుకుని కలుపుకోవాలి.
- పిండి మరీ చిక్కగా అయితే అందులో కాస్త నీళ్లు, సోడా వేసుకుని బాగా కలియబెట్టాలి. చివరగా నిమ్మరసం కూడా కలుపుకోవాలి.
- కావాలనుకుంటే కూరగాయ ముక్కలను పిండిలో కలపకుండా పైన వేసుకోవచ్చు.
- ఒక పెనం పెట్టుకుని నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. ఒక గరిటెడు పిండి తీసుకుని కాస్త మందంగా ఊతప్పం వేసుకుంటే చాలు. అంచుల వెంబడి నెయ్యి వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది.
- కూరగాయ ముక్కలు పైనుంచి వేసుకుంటే ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే రుచి బాగుంటుంది.
- రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకోవడమే.