Food for a Day: ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఎంత ఆహారం తినాలో తెలుసా?
Food for a Day: కోటి విద్యలు కూటి కొరకే. ఎంత సంపాదించినా సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. ఇక్కడ మేము ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎంత ఆహారం తీసుకోవాలో వివరిస్తున్నాము.
ఆరోగ్యకరమైన ఆహారం తింటేనే ఎక్కువ కాలం ఎవరైనా జీవించగలరు. సమతులాహారం తింటేనే ఏ వ్యక్తి అయిన ఆరోగ్యంగా ఉండగలరు. రోజూ ఆహారం తినడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి రోజు ఎంత తినాలో తెలుసుకోండి.
సరిపడినంత తినాల్సిందే
ప్రతిరోజూ ఆహారం తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. తినడం ద్వారా, శరీరం అనేక పోషకాలను పొందుతుంది. ఇది శరీరం సమతుల్య పద్ధతిలో పనిచేయడానికి సహాయపడుతుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు, లవణాలు, విటమిన్లు వంటి ఐదు భాగాలు ఉన్నాయి. ఈ అన్ని భాగాలు సరైన మొత్తంలో మన భోజనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్నే సమతుల్య భోజనం అంటారు.
ఎక్కువమంది రోజుకు మూడు సార్లు తింటారు. కాని కొంతమంది రోజంతా నాలుగైదు సార్లు స్వల్ప విరామాలలో తినడానికి ఇష్టపడతారు. ఒక వ్యక్తి రోజుకు ఎంత ఆహారం తినాలి అనేది వారి లింగం, ఎత్తు, బరువు, చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. రిపోర్టుల ప్రకారం, మహిళలు రోజుకు 2,000 కేలరీలు తినాలి, పురుషులు రోజుకు 2,500 కేలరీలు తినాలి. పిల్లలకు రోజుకు 1200 నుంచి 1400 కేలరీలు అవసరం పడతాయి. అదే సమయంలో ఒకేసారి భారీగా తినడానికి బదులు… చిన్న చిన్న భోజనాలు రోజులో ఎక్కువసార్లు తినడం వల్ల శరీరంలోని కొవ్వు పెరగకుండా ఉంటుంది.
ఆయుర్వేదంలో సమతుల్య జీవనశైలి అంటే తేలికపాటి ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాలి. అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో అధికంగా తినాలి, రాత్రి భోజనం మాత్రం చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం కూడా సూర్యాస్తమయానికి ముందే చేయాలి. ఆయుర్వేదంలో, రోజుకు రెండు భోజనం తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. మధ్యాహ్న, రాత్రి భోజనాల మధ్య ఆరు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాల్సిందే. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరుకుతుంది.
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం పొట్ట నిండేలా ఆహారం తినకూడదు. మీ జీర్ణాశయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఒక భాగాన్ని ఘన పదార్థాలు, ఒక భాగం ద్రవాలు, మూడో భాగం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని తినడమే ఆరోగ్యకరం.
ఎంత ఆకలిగా ఉన్నా కూడా పొట్ట నిండా ఆహారం తినకూడదు. 80 శాతం మాత్రమే తినాలి. చీకటి పడుతున్న కొద్దీ ఆహారం ఎంత తక్కువగా తింటే అంత మంచిది. రాత్రి నిద్రించడానికి ముందు మూడు గంటల ముందు ఆహారం తినడం పూర్తి చేయాలి.