Nutrients loss: ఇలా చేస్తే ఆహారంలోని పోషకాలు వండేటప్పుడే నశిస్తాయి, వంట చేయడంలో మెలకువలు తెల్సుకోండి
Nutrients loss: వంట వండేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పోషకాలు అందవు. కొన్ని తప్పులు చేస్తే పోషకాల నష్టమూ జరుగుతుంది. వండేటప్పుడు పాటించాల్సిన మెలకువలు ఇవే.
Cooking Affects the Nutrients : ఎక్కువ వండితే ఈ విటమిన్లు మాయమైనట్లే
మనం రోజు వారీ ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాలు.. తింటూ ఉంటాం. వీటిలో కొన్నింటిని తాజాగా తింటుంటాం. కొన్నింటిని వండుకుని తింటాం. అయితే స్టౌ మీద ఎక్కువ వేడి చేసుకుని తినడం వల్ల మన ఆహారాల్లో కొన్ని రకాల పోషకాలు తగ్గిపోతాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
విటమిన్ సి :
వండితే పోయే పోషకాల్లో మొదటి స్థానంలో ఉండేది విటమిన్‘సి’. ఇది నీటిలో కరిగే విటమిన్. ఉష్ణోగ్రతల విషయంలో ఇది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. నిమ్మకాయ, నిమ్మ జాతి పండ్లు, టమాటా, ఉసిరి, క్యాప్సికం, బ్రోకలీ, క్యాబేజీ తదితరాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం వీటిలో కొన్నింటిని సాధారణంగా ఎక్కువగా ఉడికించి, కూర చేసుకుని తింటూ ఉంటాం. అలా చేయడం వల్ల దీనిలో ఉన్న సి విటమిన్ చాలా వరకు పోతుంది. విటమిన్ సి మీ శరీరానికి చేరాలంటే తాజాగా లేదంటే చాలా తక్కువగా ఉడికించి తినాలి. వీలైతే ఆవిరి మీద ఉడికించాలి.
బి విటమిన్లు :
బి విటమిన్లు ఎక్కువ ఉష్ణోగ్రతల్ని తట్టుకుని ఆహారంలో ఉండలేవు. థయామిన్, నియాసిన్ సహా మిగిలిన బి కాంప్లెక్స్ విటమిన్లు ఇదే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి వేడి మీద ఉడికే సరికి దాదాపుగా 60 శాతం వరకు విటమిన్లు తగ్గిపోతాయి. క్యారట్లు, మాంసాలు, చేపలు, గుడ్లు, చీజ్, గుమ్మడి కాయలు, క్యాప్సికం, దోస జాతి కూరగాయలు తదితరాల్లో ఈ బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
వంట వండేటప్పుడు ఎక్కువగా నూనెలు వాడి ఎక్కువ ఉష్ణోగ్రత మీద వండితే ఇంకా అనేక పోషకాలు కోల్పోతాం. కాబట్టి వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వండేప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే :
1. వేటినైనా నీటిలో ఉడకబెట్టాలనుకుంటే వాటికి సరిపడా , వీలైనంత తక్కువ నీటిని ఉపయోగించండి. దాంతో నీరు తొందరగా ఇంకిపోయి ఎక్కువ సేపు ఉడికించాల్సిన పనీ ఉండదు. విటమిన్లు పోవు
2. కూరగాయలను ఉడికించి వండితే వాటి తొక్క తీయకండి. దాంతో కాస్త పోషక నష్టం తగ్గుతుంది. లేకపోతే పొట్టు తోనే తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా జీర్ణాశయంలోకి వెళ్లి అరుగుదలకు సహకరిస్తుంది.
3. వంట కోసం కూరగాయల్ని మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. బేబీ పొటాటో, బేబీ టమాటా, బేబీ ఆనియన్ లాంటివి అయితే కట్ చేయకుండానే వండేయాలి. దీంతో పోషకాలు కాస్త తక్కువ తగ్గుతాయి.
4. చేపలు, గుడ్లు, మాంసం లాంటి వాటిని తక్కువ సేపు వండుకుని తినలేం. ఉడకవు కూడా. అలాగని కొందరు గంటల తరబడి వీటిని వండుతుంటారు. వీటిని ఉడికిన వెంటనే స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. ఎక్కువ సేపు ఉడక్కకుండా జాగ్రత్తపడాలి.
5. వండుకున్న వంటల్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని అలాగే రోజుల తరబడి తిన్నా అందులోని పోషకాలు తగ్గిపోతాయి. దేన్నైనా వండితే ఒకటి లేదా రెండు పూటల్లో పూర్తయిపోయేలా చూసుకోండి.
6. కూరగాయలు ఉడికించిన నీళ్లను లేదా రసాలను తిరిగి ఎలాగోలా ఆహారంలో చేర్చుకునేలా చూడండి. దీంతో పోషక నష్టం తగ్గుతుంది.
టాపిక్