Butter Chicken Momos Recipe : క్లాసిక్ ఫ్యూజన్ ట్రై చేయాలంటే.. బటర్ చికెన్ మోమోస్ చేసుకోండి
12 October 2022, 7:20 IST
- Butter Chicken Momos Recipe : మోమోస్ అంటే చాలామంది ఇష్టపడతారు. దానిలో బటర్ చికెన్ మోమోస్ అంటే ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. అయితే వీటిని బయటకు వెళ్లినప్పుడు ఆర్డర్ చేసుకుని ఎక్కువగా తింటారు కానీ.. ఇంట్లో ట్రై చేయరు ఎందుకంటే.. వాటిని ఎలా తయారు చేయాలో తెలియదు కాబట్టి. మరి వాటిని ఇంట్లో సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ చికెన్ మోమోస్
Butter Chicken Momos Recipe : బటర్ చికెన్ మోమోస్‌ని ఓ క్లాసిక్ ఫ్యూజన్ రెసిపీగా చెప్పవచ్చు. ఇది నాన్‌వెజ్, మోమోస్ ప్రియులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. మరి బటర్ చికెన్ మోమోస్‌ని ఎలా తయారు చేసుకోవాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బటర్ చికెన్ గ్రేవీ - అర కప్పు
* ఆల్ పర్పస్ ఫ్లోర్ - ఒకటిన్నర కప్పు
* చికెన్ - 200 గ్రాములు (చిన్నచిన్న ముక్కలుగా కోయాలి)
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి - 1 టీస్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* ఫ్రెష్ క్రీమ్ - గార్నిష్ చేయడానికి
* ఆయిల్ - ఫ్రై చేయడానికి తగినంత
బటర్ చికెన్ మోమోస్ తయారీ విధానం
ముందుగా ఆల్-పర్పస్ పిండిని నీరు పోసి.. బాగా మెత్తని పిండిలా చేసుకుని పక్కన పెట్టండి. చికెన్ ముక్కల(కీమా)కు ఉప్పు, బ్లాక్‌పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత పిండిలో చిన్న భాగాన్ని తీసుకుని.. దానిని రోల్ చేసి.. సిద్ధం చేసిన ముక్కలతో మోమోలు చేయండి. పిండి విడిపోకుండా.. అంచులపై నీటిని రాసి.. కలపండి.
ఇలా తయారు చేసిన మోమోస్‌ను 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అనంతరం పాన్‌లో నూనె వేడి చేసి.. మోమోస్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. అనంతరం బటర్ చికెన్ గ్రేవీలో వేసి అన్నీ బాగా కలపాలి. దీనిని ఫ్రెష్ క్రీమ్‌తో గార్నిష్ చేయండి. అంతే వేడి వేడి బటర్ చికెన్ మోమోస్ రెడీ. హ్యాపీగా లాగించేయండి.