Aloo Egg Curry | ఆలుగడ్డ, కోడిగుడ్డు.. కలిపి వండితే, రుచి వెరీ గుడ్డు!
09 November 2022, 20:29 IST
- మీరు ఆలుగడ్డ కూర, కోడిగుడ్డు కూర విడివిడిగా తిని ఉంటారు, కానీ కలిపి వండితే ఇంకా కమ్మగా ఉంటుందట. Aloo Egg Curry Recipe ఇక్కడ ఉంది చూడండి.
Aloo Egg Curry Recipe
ట్రెండీగా ఏదైనా వండుకొని తినాలని మనసు కోరితే.. ఆలుగడ్డలు, కోడి గుడ్డు కలిపి ఆలూ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. ఇదేమి వెరైటీ, వింత వంటకేం కాదు. ఇప్పుడు చాలా మంది ఇలా వండుకుంటున్నారు. ఈ రెసిపీ ముఖ్యంగా బెంగాలీ కెచెన్ నుంచి వచ్చినది. బెంగాలీలు అన్నింటిలో బంగాళాదుంపలు వేసుకుని తింటారు, అలాగే కోడిగుడ్డు కూరలోనూ ఆలుగడ్డ వేసి వండితే దీని రుచి కూడా అదిపోతుందంటున్నారు. అస్సామీలు కూడా ఆలూ కోనిర్ డోమ్ అనే పేరుతో ఇదే తరహాలో వండుకుంటారు.
ఆలూ ఎగ్ కర్రీ కొద్దిగా ఫ్రై లేదా గ్రేవీ రూపంలో వండుకోవచ్చు. గ్రేవీ రూపంలో వండితే నోరూ ఊరేలా సువాసనలను వెదజల్లుతుంది. కసూరీ మెంతి, కరివేపాకు కూడా వేస్తే కూర ఇంకా ఘుమఘుమలాడుతుంది. చిక్కగా గ్రేవీ కూర చేసుకుంటే అన్నం, రోటీ, చపాతీలకి బాగా సరిపోతుంది. ఎర్రగా, కారంగా ఒకవైపు గుడ్డు, మరోవైపు గడ్డ, ఇలా రెండింటిని కలిపి తింటే ఆ ఆనందం డబుల్ ఉంటుంది.
మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆలూ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం కావాలో తెలుసుకోండి. ఈ కింద ఆలూ ఎగ్ కర్రీ రెసిపీ ఉంది.
Aloo Egg Curry Recipe కోసం కావలసినవి
- కోడిగుడ్లు - 4
- ఆలుగడ్డలు - 2
- టమోటోలు - 2
- ఉల్లిపాయలు - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 2 నుండి 4
- కారం పొడి- 3 టీస్పూన్లు
- గరం మసాలా పౌడర్ - 2 స్పూన్
- పసుపు పొడి - 1 tsp
- బిర్యానీ ఆకు 1
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- రుచికి సరిపడా ఉప్పు
ఆలుగడ్డ కోడిగుడ్డు కూర రెసిపీ- తయారీ విధానం
- ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి, అలాగే ఆలుగడ్డలను కొద్దిగా ఉడికించి, పొట్టుతీసి, ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేయండి. అందులో ఉడికించిన గుడ్లు, ఉప్పు, 1 టీస్పూన్ కారం వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో బంగాళదుంపలు వేయించాలి, మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ఆపై దీనిని ఒక పక్కన పెట్టండి.
- ఇప్పుడు అందులోనే నూనెలో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కారం సహా మసాలాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఈ టమోటా కూరలో వేయించిన గుడ్లు, ఆలుగడ్డలు వేసి, సరిపడా నీరు పోసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని, మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించండి.
చివరగా తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలుగడ్డ కోడిగుడ్డు కూర రెడీ.