Egg Fenugreek Curry Recipe । కోడిగుడ్డు టమోటా మెంతికూర.. కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా!
26 May 2023, 13:07 IST
- Egg Fenugreek Curry Recipe: అనేక ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలు కలగలిసిన కోడిగుడ్డు టమోటా మెంతికూర వంటకాన్ని ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.
Egg Fenugreek Curry Recipe:
Healthy Recipes: రుచికరమైన మంచి భోజనం చేయాలంటే రుచికరమైన కూరలు ఉండాలి. టమోటాలు, కోడిగుడ్డుతో చాలా రకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ రెండింటి కలయిక కూడా అద్భుతంగా ఉంటుంది, ఇందులో మెంతికూర కూడా కలుపుకుంటే మరింత ఫ్లేవర్ వస్తుంది. కోడిగుడ్డు టమోటా మెంతికూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వంటకం ఎంతో రుచికరమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా.
కోడిగుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లతో పాటు గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. టొమాటోలో పొటాషియం, విటమిన్లు బి, ఇ లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. మెంతికూర వ్యాధులతో పోరాడడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పోషకాలు కలగలిసిన కోడిగుడ్డు టమోటా మెంతికూర వంటకాన్ని ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.
Egg Tomato Fenugreek Curry Recipe కోసం కావలసినవి
- 4 గుడ్లు
- 2 కప్పుల మెంతి ఆకులు
- 2 ఉల్లిపాయలు
- 6 టమోటాలు
- 2 పచ్చిమిర్చి
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1.5 టీస్పూన్లు కారం పొడి
- 1/2 టీస్పూన్ పసుపు పొడి
- 2 టీస్పూన్లు ధనియాల పొడి
- 1/2 టీస్పూన్ గరం మసాలా
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- తాజా కొత్తిమీర
- ఉప్పు రుచికి తగినంత
కోడిగుడ్డు టమోటా మెంతికూర కర్రీ తయారీ విధానం
- ముందుగా కూరగాయలను, ఆకుకూరలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి.
- మొదటగా ఒక నాన్ స్టిక్ పాత్రలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి వేయించండి. ఆపైన మెంతి ఆకులు వేసి అన్నీ కలిపి కొద్దిగా ఉడికించాలి.
- ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తరిగిన టొమాటోలు, ఉప్పు వేసి కలపాలి. టమోటాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి కలపండి.
- ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చసొనను వేరుచెసి గిలక్కొట్టండి. అందులో తగినంత కారం, ఉప్పు వేసి ఉడుకుతున్న కూరలో వేయండి, పచ్చసొన కూడా మెల్లగా జారవిడవండి. మూత పెట్టి 4 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి.
- గుడ్డు ఉడికిన తర్వాత మృదువుగా కలిపి మరో నాలుగు నిమిషాలు ఉడికించండి.
- చివరగా కొత్తిమీర ఆకులతో అలంకరించండి
అంతే కోడిగుడ్డు టమోటా మెంతికూర రెడీ. అన్నంతో లేదా చపాతీలతో వేడివేడిగా తినండి, రుచిని ఆస్వాదించండి.