Breakfast Recipes for Kids । మీ పిల్లలు వద్దనకుండా తినగలిగే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇవిగో!
01 February 2023, 6:06 IST
- Breakfast Recipes for Kids: పిల్లలకు ఇష్టమైన ఆహారం చేయడం మాత్రమే కాదు, వారి కంటికి నచ్చేలా ఇష్టమైన విధంగానూ చేయాలి. ఇక్కడ పిల్లలు ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఉన్నాయి చూడండి.
Breakfast Recipes for Kids
Breakfast Recipes for Kids: మీ ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే ఉదయాన్నే వారిని రెడీ చేసి, వారికోసం కష్టపడి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి, వారిని స్కూల్ బస్సు ఎక్కించడం ఒక పెద్ద టాస్క్. మీరు ఉరుకులు పరుగులతో వారికోసం ఎంత మంచి అల్పాహారం చేసినా వారు తినకపోవచ్చు. పోనీ వారి లంచ్ బాక్సులో పెట్టినా, ఏమీ తినకుండా తిరిగి సాయంత్రం అలాగే తిరిగి వస్తారు. వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడానికి చాలా రకాల వ్యూహాలు అమలు పరచాల్సి వస్తుంది.
మీ పిల్లలకు నచ్చేలా, వారు మెచ్చేలా ఆసక్తికరమైన 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను అందిస్తున్నాం. అంతేకాకుండా, ఈ వంటకాలను కేవలం మీరు కొద్ది నిమిషాల్లోనే తయారుచేయవచ్చు. ఈ అల్పాహారాలు వారు ఏ సమయంలో అయినా తినడానికి ఇష్టపడతారు. వారికి రోజులో కావలసిన పోషకాలు, శక్తి లభిస్తాయి. మరి ఆ రెసిపీలు ఏంటో చూసేయండి.
Egg Sandwich Recipe కోసం కావలసినవి
- 2 ఉడికించిన గుడ్లు
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 1 క్యారెట్
- రుచి ప్రకారం ఉప్పు
- రుచి ప్రకారం మిరియాల పొడి
- రుచి ప్రకారం కారం పొడి
- 2 మల్టీగ్రెయిన్ బ్రెడ్ ముక్కలు
- 2 టీస్పూన్ వంట నూనె
ఎగ్ శాండ్‌విచ్ తయారీ విధానం
- ముందుగా ఉడికించిన గుడ్లను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్డు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిపై ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లి బాగా కలపాలి.
- తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా వంటనూనెను వేడి చేయాలి. రెండు మల్టీగ్రెయిన్ బ్రెడ్ ముక్కల మధ్య గుడ్డు మిశ్రమాన్ని పూరించండి, ఆపై బ్రెడ్ క్రిస్పీగా అయ్యే వరకు పాన్‌లో టాసు చేయండి.
ఎగ్ శాండ్‌విచ్ రెడీ వేడి వేడిగా వడ్డించండి.
Ragi Tacos Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు రాగి పిండి
- 2 టాకో షెల్స్
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 1 క్యారెట్
- 1 క్యాప్సికమ్
- 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న
- 2 టేబుల్ స్పూన్ నూనె
- రుచి ప్రకారం ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి
- పాలకూర లేదా క్యాబేజీ అకులు
- 1 కప్పు పెరుగు
రాగి టాకోస్ తయారీ విధానం
- ఒక గిన్నె తీసుకుని అందులో ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్, క్యాప్సికమ్ లను ముక్కలుగా కోసి వేయాలి.
- ఆపై మొక్కజొన్నలు, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి అన్నీ బాగా కలపాలి.
- ఒక పాన్ తీసుకుని నీళ్ల మరిగించి రాగి పిండిని బాగా ఉడికించాలి.
- ఇప్పుడు ఫిల్లింగ్ మిశ్రమంలో పెరుగు, ఉడికించిన రాగి పిండిని వేసి బాగా బ్లెండ్ చేయండి.
- అనంతరం టాకో షెల్స్‌ని తీసుకుని, మిశ్రమం క్రిస్పీగా, రంగు కొద్దిగా బ్రౌన్‌గా మారే వరకు వాటిని కాల్చండి.
పూర్తయిన తర్వాత, పాలకూర ఆకులను పక్కన ఉంచి, మిశ్రమాన్ని నింపి వెంటనే సర్వ్ చేయాలి.