Dhaba Style Egg Sandwich । దాబా స్టైల్‌లో ఎగ్ శాండ్‌విచ్.. అదిరిపోయే టేస్ట్!
మీరు దాబా స్టైల్ ఎగ్ శాండ్‌విచ్‌ను ఎప్పుడైనా రుచి చూశారా? టేస్ట్ మామూలుగా ఉండదు పిచ్చెక్కించేస్తుంది. ఎలా చేసుకోవాలో Dhaba Style Egg Sandwich Recipe ఇక్కడ ఉంది చూడండి.
ప్రతిరోజూ ఉరుకులు పరుగుల జీవితంలో చాలా సార్లు ఉదయం అల్పాహారం సరిగ్గా చేయకుండానే పనులకు వెళ్లిపోతుంటారు. కాబట్టి కనీసం వీకెండ్‌లో అయినా ఓపికగా అల్పాహారం చేసుకొని, ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా తినాలి. మీరు బ్రేక్‌ఫాస్ట్ కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొనే అల్పాహారాలలో ఎగ్ శాండ్‌విచ్ కూడా ఒకటి. దీనిని మనం బ్రెడ్ ఆమ్లెట్ అని కూడా పిలుచుకోవచ్చు. మీరు బ్రెడ్ ఆమ్లెట్ చాలా సార్లు తినే ఉంటారు. అయితే దాబా స్టైల్‌లో.. ఇంట్లో ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? మీకు ఇప్పుడు దాబా స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని తెలియజేస్తున్నాం. ఈ వెర్షన్‌లో టొమాటోలు, మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే మీకు నచ్చిన విధంగా మసాలాలు కలుపుకోవచ్చు.
ఈ శాండ్‌విచ్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే కాదు, మధ్యాహ్నం లంచ్ లాగా, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌కి కూడా సరైనది. ప్రయాణంలో వెళ్తూ కూడా తినేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎగ్ శాండ్‌విచ్ అలియాస్ బ్రెడ్ ఆమ్లెట్‌ను దాబా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో కింద రెసిపీని చూసి తెలుసుకోండి.
Dhaba Style Egg Sandwich Recipe కోసం కావలసినవి
- 3 గుడ్లు
- 1 టేబుల్ స్పూన్ వెన్న
- 2 బ్రెడ్ ముక్కలు
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/4 టీస్పూన్ మిరప పొడి
- 1 టేబుల్ స్పూన్ టమోటా ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
- తాజా కొత్తిమీర
- రుచికి తగినట్లుగా ఉప్పు, మిరియాల పొడి
దాబా స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం
- ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టండి, అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు వేసి బాగా గిలక్కొట్టండి.
- ఇప్పుడు ఒక స్కిల్లెట్‌లో మీడియం అధిక వేడి మీద వెన్నని వేడి చేయండి.
- వెన్న వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- టమోటాలు ఉడికిన తర్వాత గుడ్లు పోసి, ఆమ్లెట్ లాగా చేసుకోవాలి. ఒక 30 సెకన్ల పాటు ఉడికించాలి.
- ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లలో ఒకదానిని ఆమ్లెట్ మీద వేసి, కొన్ని సెకన్ల పాటు గుడ్లతో పూత పెట్టి, మరోవైపు తిప్పండి. రెండో బ్రెడ్ స్లైస్ కూడా ఇలాగే చేయండి.
- ఇప్పుడు ఆమ్లెట్‌ను కొన్ని సెకన్ల పాటు కాల్చి, నిదానంగా మడత తిప్పి మరోవైపు కాల్చాలి.
- బ్రెడ్ స్లైస్‌లలో ఒకదానిపై కొత్తిమీర ఆకులను వేసి, శాండ్‌విచ్‌ను మూసివేయండి. కొన్ని సెకన్ల పాటు ఉడికించండి.
అంతే ఎగ్ శాండ్‌విచ్ రెడీ.. మీకు ఇష్టమైన చట్నీ లేదా వేడి సాస్‌తో సర్వ్ చేయండి.
సంబంధిత కథనం