Goli Idli Breakfast | ఎప్పుడూ అవే ఇడ్లీలు ఎందుకు.. ఈసారి గోల్ గోల్‌గా ఉండే గోలి ఇడ్లీలను తిని చూడండి
13 November 2022, 8:45 IST
- మీకు ఇడ్లీ ఎలా ఉంటుందో తెలుసు, దాని రుచి ఎలా ఉంటుందో తెలుసు. కానీ మీరు ఇది వరకు చూడని సరికొత్త అవతారంలో గోలి ఇడ్లీని పరిచయం చేస్తున్నాం. Goli Idli Recipe ఇక్కడ ఉంది చూడండి.
Goli Idli Recipe
ఇడ్లీ అనేది దక్షిణ భారతదేశంలోని ఒక సాంప్రదాయికమైన, సంస్కారవంతమైన అల్పాహారం. ఆవిరిలో ఉడికించిన మెత్తటి, వెచ్చటి ఇడ్లీలపై కొద్దిగా కారం పొడి, నెయ్యి చల్లుకొని, చట్నీతో అద్దుకొని తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్ అంటే ముందుగా ఇడ్లీనే గుర్తుకొస్తుంది.
ఇడ్లీ ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ సృజనాత్మకత ఉన్నవారు వంటలతో ప్రయోగాలు చేస్తూ సరికొత్త రుచులను జనాలకు అందిస్తున్నారు. వడలకే మధ్యలో ఎందుకు బొక్క ఉండాలి, ఇడ్లీలకు ఎందుకు ఉండకూడదు? అనే వెరైటీ ఆలోచనలు వచ్చినట్లుగా.. ఇడ్లీలు స్పాంజ్ కేకుల్లా ఎందుకు ఉండాలి? రసగుల్లాలా గుండ్రంగా ఎందుకు ఉండకూడదు అనకున్నారో ఏమో 'గోలి ఇడ్లీ' పేరుతో సరికొత్త ఆవతారాన్ని అందించారు. గోలీ ఇడ్లీ ఒక ప్రత్యేకమైన ఇడ్లీ, ఇది గుండ్రని బంతి ఆకారంలో ఉంటుంది. రుచికూడా ప్రత్యేకంగా ఉంటుంది. కొద్దిగా గుజరాతీ డోక్లా రుచిని కలిగి ఉంటుంది. మీరూ ఈ వీకెండ్‌లో గోలి ఇడ్లీ ప్రయత్నించాలనుకుంటే ఈ కింద గోలి ఇడ్లీ రెసిపీ అందిస్తున్నాం చూడండి.
Goli Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం పిండి
- 1 స్పూన్ మినప పప్పు
- 1 స్పూన్ నెయ్యి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 స్పూన్ ఆవాలు
- 1.5 టీస్పూన్ శనగ పప్పు
- 2 స్పూన్ నువ్వులు
- 1 ఎండు మిరపకాయ
- 1 పచ్చిమిర్చి
- 3-4 కరివేపాకు
- 2- తరిగిన కారం
- 1/2 స్పూన్ అల్లం పేస్ట్
- 1 స్పూన్ ఉప్పు
- 1 కప్పు నీరు
గోలి ఇడ్లీ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా బాణలిలో నీటిని మరిగించి, అందులో ఉప్పు, నెయ్యి వేసి కలపండి. ఇందులో బియ్యం పిండి వేసి, కలిపి పక్కనబెట్టండి.
- లేదా బియ్యం పిండిలో ఉప్పు, నెయ్యి వేసి, ఆపై వేడి నీరు పోసి పిండి ముద్దగా చేసి కాసేపు పక్కనపెట్టండి.
- ఇప్పుడు పిండి ముంద్దను చిన్నచిన్న బాల్స్‌గా చేసి 10-15నిముషాలు కుక్కర్ లో ఆవిరిమీద ఉడికించాలి.
- మరొక పాన్‌లో నూనె వేడి చేసి మినపపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, నువ్వులు, అల్లం వేసి వేయించాలి.
- ఇడ్లీ అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని ఇడ్లీలకు పట్టించండి, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి.
అంతే రుచికరమైన గోలి ఇడ్లీ రెడీ. వేడివేడిగా వీటి రుచిని ఆస్వాదించండి.