Tips for Winter Joint Pain Relief । చలికాలంలో కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!
24 November 2022, 15:40 IST
- Tips for Winter Joint Pain Relief: చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి, నివారణకు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
Tips for Winter Joint Pain Relief
చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. అందుకే కాబోలు చలి ఎక్కువగా ఉంటే ఎముకలు కొరికే చలి అని అభివర్ణిస్తారు. వణికించే చలి కారణంగా కీళ్లు, మోకాళ్లు, ఎముకలలో ఎక్కువ నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఈ నొప్పులు బాధాకరంగా ఉంటాయి. ఆర్థరైటిస్ (Arthritis) రోగులకు చల్లని వాతావరణం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి కీళ్లలో వాపు పెరిగిపోయి ఒకే చోట కూర్చోవడం, లేవడం లేదా నడవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు కలిగిన వారు ఈ చల్లని వాతావరణంలో శరీరాన్ని ఎంత వెచ్చగా ఉంచుకుంటే కీళ్లనొప్పుల సమస్య అంత తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మనకు నొప్పి, వాపు ఉన్నప్పుడు సాధారణంగా ఇంటి చిట్కాలలో భాగంగా వెచ్చని కాపడం పెట్టుకోవడం తెలిసిందే. అయితే ప్రతీసారి ఇలా చేసుకోవడం సాధ్యం కాబట్టి, శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం వల్ల కీళ్లు, ఎముకల్లో నొప్పి ఉండదు, వాపు సమస్య కూడా ఉండదు.
Tips for Winter Joint Pain Relief- చలికాలంలో కీళ్ల నొప్పుల నివారణకు చిట్కాలు
ఈ శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మరికొన్ని థెరపీలు సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
నెయ్యి తినండి
శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచడంలో దేశీ నెయ్యి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ సీజన్‌లో ప్రతిరోజూ నెయ్యి తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది మలబద్ధకం, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. మీరు దీన్ని పప్పు, కూరగాయలు, పాయసం లేదా రోటీతో తినవచ్చు.
గుడ్లు
కూరగాయల్లో రాజు వంకాయ అయితే, ప్రొటీన్లలో కోడిగుడ్డును రాజుగా పరిగణించవచ్చు. కోడిగుడ్డులోని పోషకాలు వేడి గుణాలను కలిగి ఉంటాయి. ఈ చలికాలంలో గుడ్లు తినడం ద్వారా మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవచ్చు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే పోషకాలు శరీరాన్ని ఎక్కువ సేపు వెచ్చగా ఉంచుతాయి.
పసుపు పాలు
పసుపులో ఉండే యాంటీ బయాటిక్స్ లక్షణాలు, పాలలోని కాల్షియం శక్తి రెండూ కలిసి ఆర్థరైటిస్ రోగులకు నొప్పుల నుంచి గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. రాత్రి పడుకునే ముందు పాలలో పసుపు కలిపి తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండడంతో పాటు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్‌లు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం వెచ్చగా ఉంటుంది , అప్పుడు ఆర్థరైటిస్ నొప్పి పెద్దగా బాధించదు.
యోగా ఆసనాలు
శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు యోగా థెరపీ కూడా గొప్పగా పనిచేస్తుంది. ఈ చలికాలంలో ప్రతిరోజూ కొన్ని ప్రత్యేక యోగ ఆసనాలు వేయడం సాధన చేస్తూ ఉండాలి. ఇందులో నౌకాసనం, శీర్షాసనం, సేతుబంధాసనం, కుంభకాసనం వంటి ఆసనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఆర్థరైటిస్ పేషెంట్లు సులభమైన యోగాసనాలు వేయవచ్చు కానీ అవి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. లేకుంటే ఆసనం తిరగబడే ప్రమాదం ఉంటుంది.