Rheumatoid Arthritis । కీళ్లనొప్పులను అశ్రద్ధ చేయకండి.. ఈ లక్షణాలు యమ డేంజర్!-the early signs and symptoms of rheumatoid arthritis know treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   The Early Signs And Symptoms Of Rheumatoid Arthritis, Know Treatment

Rheumatoid Arthritis । కీళ్లనొప్పులను అశ్రద్ధ చేయకండి.. ఈ లక్షణాలు యమ డేంజర్!

HT Telugu Desk HT Telugu
May 18, 2022 05:11 PM IST

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ వయస్సులోనైనా సంభవించే ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్‌లో ఒకటి. అయితే ఇది 30-50 సంవత్సరాల మధ్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కంప్యూటర్ కీబోర్డ్ నొక్కేవారిలోనూ ఈ తరహా నొప్పులు ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి.

Rheumatoid Arthritis
Rheumatoid Arthritis (Unsplash)

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికమైన వ్యాధి. చేతులు, కాళ్ళతో సహా అనేక కీళ్లను ప్రభావితం చేసే ఒక బాధాకరమైన అనారోగ్య సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కీళ్లలో ఒకరమైన మంట కలుగుతుంది. దీంతో నడవాలన్నా, పనిచేయాలన్నా కష్టంగా ఉంటుంది.

విచిత్రం ఏమిటంటే మనల్ని వివిధ రోగాల బారి నుండి కాపాడే మన శరీరంలోనే రోగనిరోధక శక్తే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి శరీరంలోని తన స్వంత కణజాలాలపై దాడిచేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో అంతర్గత అవయవాలపైనా దాడి చేస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లైనింగ్‌లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బాధాకరమైన నొప్పి, వాపు వస్తుంది. చాలా కాలం పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను అనుభవిస్తే చివరకు అది ఎముకల కోతకు, అలాగే కీళ్ల వైకల్యానికి కారణమవుతుంది.

అంతేకాదు ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు, ఒకసారి ఎవరికైనా కలిగితే వారసత్వంగా తమ కుటుంబంలో తర్వాతి తరం వారినీ ఈ సమస్య వేధించే అవకాశం ఉంది.

అయితే లక్షణాలు తెలిసినపుడు మొదటి 3-4 నెలలలో ఫిజియోథెరపీ, కొన్ని యాంటీ-రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ దూకుడుగా నివారణ ప్రయత్నాలు చేస్తే అది ఈ వ్యాధి వృద్ధి చెందకుండా మందగించడంలో సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.

ప్రారంభ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు

  • మోచేతులు, మోకాళ్లు, మణికట్టు, వేళ్లు ఇతర కీళ్లలో వాపు లేదా నొప్పి ఉంటుంది, ప్రభావిత భాగాలు సున్నితంగా మారతాయి.
  • కొంతమందికి మోకాలు లేదా మోచేయి లేదా చీలమండలలో ఏదో ఒకచోట మాత్రమే నొప్పులు ఉండవచ్చు.
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ఉన్నపుడు తెల్లవారుజామున కీళ్లు గట్టిగా కట్టెలాగా మారతాయి. 30 నిమిషాల లేదా అంతకంటే ఎక్కువ సేపు కదిలించలేనట్లుగా అనిపిస్తుంది.
  • వృద్ధులు, 60 ఏళ్లు పైబడిన వారిలో స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు, అలసట, బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.
  • ఈ వ్యాధిలో పాలిండ్రోమిక్ RA అనేది మరొక అసాధారణ రూపం. ఇది ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు ఒక రోజు కొద్దిసేపు ఉంటాయి. ఆ తర్వాత అంతా మామూలుగానే అనిపించినా కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది.

రోగ నిర్ధారణ- నివారణ

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ వ్యాధిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా సరైన వైద్య సహాయం తీసుకోవాలి. ఒక వ్యక్తికి 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కీళ్ల నొప్పులు ఉంటే, అవి రెండువైపులా కలుగుతుంటే, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి.

కొన్నిరకాల రక్త పరీక్షలు, కాలేయం, మూత్రపిండాల పనితీరు, CRP/ESR టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ లేదా MRI కూడా చేయవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ అని నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు నడుచుకోవడమే ఉత్తమం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్