Sleeping Tips : మీకు తెలియకుండా మీ నిద్రను పాడు చేసే అలవాట్లు
03 February 2024, 18:45 IST
- Sleeping Tips In Telugu : మన నిద్రను పాడుచేసేందుకు మనకు ఉండే అలవాట్లే కారణం. మనం తెలియకుండానే రోజూ ఆ పనులు చేస్తాం. దీంతో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటాం.
నిద్ర సమస్యకు కారణాలు
మనిషికి నిద్ర అనేది సరిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఎంత డబ్బు ఉన్నా దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయెుచ్చు. నిద్ర మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన నిద్ర లేకుంటే మానసిక సమస్యలు వస్తాయి. దేనిపైనా దృష్టి పెట్టలేరు. ఆరోగ్యకరమైన శరీరానికి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. 7 నుండి 8 గంటల నిద్రపోవాలి. నిద్రలేమి మీ రోజువారీ కార్యకలాపాలు, విధులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిద్రలేమికి దారితీసే కొన్ని అంశాలను చదవండి.
భోజనం త్వరగా చేయాలి
రాత్రి 10 గంటల తర్వాత ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు నిద్రలేమితో బాధపడతారు. ఒత్తిడితో కూడిన షెడ్యూల్ 10 గంటలలోపు భోజనం చేయడం కష్టంగా ఉంటుంది. ఆరోగ్యం దృష్ట్యా త్వరగా తినాలి. రాత్రి 8 నుండి 10 గంటల మధ్య భోజనం చేయాలి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. త్వరగా తిని కొంత సమయం తర్వాత నిద్రపోవాలి.
రాత్రిపూట నారింజ లేదా ద్రాక్షపండ్లు తినడం వల్ల కూడా నిద్రలేమి వస్తుంది. ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల గుండెల్లో మంట, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఖాళీ కడుపుతో పడుకోవద్దు
అతిగా తినడం, ఉపవాసం రెండూ నిద్రను ప్రభావం చూపిస్తాయి. అతిగా తింటే 2 నుంచి 3 గంటల తర్వాత నిద్రపోవడం మంచిది. ఖాళీ కడుపుతో మంచి నిద్ర పొందడం అసాధ్యం అవుతుంది. రాత్రిపూట భోజనం మానేయడం వల్ల మీ నిద్రలేమికి దారి తీస్తుంది.
ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ సాధరణమైపోయాయి. పగలు, రాత్రి మీ చేతిలో ఫోన్ ఉంటే.. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మొబైల్ ద్వారా వెలువడే కాంతి మన శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
నిద్రకు ముందు వ్యాయామం చేయకూడదు
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అలసట తగ్గడం ద్వారా వేగంగా నిద్ర పోవచ్చు. కానీ నిద్రపోయే ముందు వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి కలుగుతుంది. రాత్రిపూట వ్యాయామం చేసే బదులు ఉదయాన్నే వ్యాయామం చేయడం ఉత్తమం.
మన పడకగది కేవలం సౌకర్యంగా ఉండటానికే పరిమితం కావాలి. టీవీ లేదా కంప్యూటర్లు ఉన్నప్పుడు నిద్రపై దృష్టి పెట్టడానికి కష్టమవుతుంది. మెదడుకు ఆటంకం కలిగిస్తుంది. ఇవి మనల్ని అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా చేస్తాయి.
కొంతమంది కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్ళు ఆడించడం అలవాటు చేసుకుంటారు. ఇది కేవలం అభిరుచి మాత్రమే కాదు వ్యసనంగా, వ్యాధిగా మారింది. ఇది కూడా నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది.
చల్లటి నీటితో ముఖం కడుక్కోవద్దు
పడుకునే ముందు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు మానుకోవాలి. ఎందుకంటే పడుకునే ముందు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం నిద్రను ప్రభావితం చేస్తుంది. శక్తిని ఉత్పత్తి చేయడానికి మన శరీర కణజాలాలను సక్రియం చేయడం ద్వారా చల్లని నీరు మనల్ని నిద్ర నుండి మేల్కొల్పుతుంది. ఈ రకమైన వ్యాధి ఉన్న 5 నుండి 10 మందికి నిద్రలేమి ఉంటుంది.
కాఫీ అస్సలు తాగొద్దు
మీ నిద్రకు భంగం కలిగించే అంశాలలో కాఫీ తాగడం ఒకటి. కాఫీలోని కెఫిన్ మన శరీరాన్ని ఉత్తేజపరిచి శక్తిని ఉత్పత్తి చేయడం ద్వారా నిద్రను ఆలస్యం చేస్తుంది. కాఫీ తాగే బదులు పడుకునే ముందు చాక్లెట్ పీస్ తీసుకుంటే బెటర్. మన రోజువారీ జీవితంలో వీలైనంత వరకు వాటిని నివారించడం ద్వారా నిద్రతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మంచి నిద్ర మనస్సును ఉల్లాసంగా ఉంచుతుంది. సగం నిద్ర లేదా నిద్ర లేకపోవడం వల్ల మనస్సుపై ప్రభావం పడుతుంది. అందుకే రాత్రిపూట కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే హాయిగా నిద్రపోతారు. పైన చెప్పిన విషయాలను ఫాలో అయిపోండి.