SSC Exam : 5,369 పోస్టులకు ఎగ్జామ్.. తెలంగాణలో మూడు కేంద్రాలు
14 March 2023, 14:04 IST
- SSC Selection Post Phase 11 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్ నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ, తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవలే.. 5369 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్-జూలైలో 5,369 ఖాళీలతో రిక్రూట్‌మెంట్ కోసం పోటీ పరీక్షను నిర్వహిస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలకు 5,369 ఖాళీలతో పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించనుంది.
దక్షిణ ప్రాంతంలో CBE-మోడ్ పరీక్షలు 22 కేంద్రాల్లో జరుగుతాయి. తెలంగాణలో మూడు కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో 11, పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడులో ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి.
పోస్టుల వివరాలు : ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్.. ఇంకా తదితర పోస్టులు ఉన్నాయి.
పోస్టులను అనుసరించి.. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కావాలి. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదు ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉండనుంది. కంప్యూటర్ పరీక్ష(Computer Exam) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, దానికి 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్ నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు ఉండనున్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్క్ ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు మార్చి 06, 2023 నుంచి మార్చి 27, 2023 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేది మార్చి 28, 2023గా ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జూన్- జులై 2023లో నిర్వహిస్తారు.