New Course in Degree: ఆనర్స్ డిగ్రీగా 'కంప్యూటర్ సైన్స్'.. వచ్చే ఏడాది నుంచే అమలు
telangana higher education council:గత కొద్దిరోజులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా డిగ్రీ స్థాయిలో మరో కోర్సును తీసుకురానుంది.
Four-year Computer Science course for degree students: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే పనిలో పడింది ఉన్నత విద్యామండలి. ఇప్పటికే డిగ్రీ స్థాయిలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టగా... తాజాగా మరో అడుగు ముందుకు వేయనుంది. తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ను ఆనర్స్ డిగ్రీ కోర్సుగా అమలు చేయాలని నిర్ణయించింది.
శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో కొత్త కోర్సులపై చర్చించారు. ప్రస్తుతం 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దోస్త్ ద్వారా ఈ కోర్సు సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటికే బీఏ ఆనర్స్ హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టగా, ఇవి విజయవంతంగా అమలవుతున్నాయి.
ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలివస్తున్న నేపథ్యంలో...ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఐటీ కంపెనీలన్నీ కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివిన వారికే పెద్దపీట వేస్తున్న క్రమంలో...ఈ కోర్సు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల్లో కూడా ఈ కోర్సును ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు.
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టనునుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. సంప్రదాయ డిగ్రీతోపాటు బీఫార్మసీ తదితర డిగ్రీ స్థాయి కోర్సుల్లో విద్యార్థులు ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించటమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం. సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుపై చర్చించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల పోలీసు శాఖ, ఓయూ, జేఎన్‌టీయూహెచ్, నల్సార్ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొదటి సెమిస్టరులో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టు బోధన కొనసాగుతుందన్నారు. దీనికి రెండు క్రెడిట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టు పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో రూపొందించనున్న ఈ పుస్తకాలను కొన్ని నిర్దేశిత వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు.