Cyber Security Subject in Degree: ఇక డిగ్రీలో 'సైబర్ సెక్యూరిటీ' సబ్జెక్ట్
Cyber Security Subject in Telangana: గత కొద్దిరోజులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఒక సబ్జెక్ట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి తీసుకురానుంది.
Universities, colleges to offer course on Cyber Security in Telangana: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే పనిలో పడింది ఉన్నత విద్యామండలి. ఇప్పటికే డిగ్రీ స్థాయిలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టగా... తాజాగా మరో అడుగు ముందుకేసింది. ప్రపంచానికి సవాల్ విసురుతున్న అంశాల్లో సైబర్ నేరాలు కూడా ఒకటి. ఆయా విషయాల్లో కనీస అవగాహన లేక ఏంతో మంది బలైపోతున్నారు. ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఉన్నత విద్యామండలి. ఇక డిగ్రీస్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టేందకు సిద్ధమైంది.
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయ డిగ్రీతోపాటు బీఫార్మసీ తదితర డిగ్రీ స్థాయి కోర్సుల్లో విద్యార్థులు ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించటమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం. సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుపై చర్చించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల పోలీసు శాఖ, ఓయూ, జేఎన్‌టీయూహెచ్, నల్సార్ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొదటి సెమిస్టరులో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టు బోధన కొనసాగుతుందన్నారు. దీనికి రెండు క్రెడిట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టు పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో రూపొందించనున్న ఈ పుస్తకాలను కొన్ని నిర్దేశిత వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు.
student academic verification service portal: నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్‌కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్‌ఏవీఎస్) అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పోర్టల్ ను నవంబర్ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి గత 12 సంవత్సరాల్లో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డేటాను ఈ పోర్టల్ లో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు.