Telangana Forest University : తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ కోర్సులు, ఇతర విషయాలు మీకు తెలుసా?-here is complete details about telangana forest university ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Here Is Complete Details About Telangana Forest University

Telangana Forest University : తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ కోర్సులు, ఇతర విషయాలు మీకు తెలుసా?

Anand Sai HT Telugu
Sep 13, 2022 06:54 PM IST

Telangana Forest University Courses : సోమవారం అసెంబ్లీలో అటవీ విశ్వవిద్యాలయం తెలంగాణ చట్టం 2022ను ప్రవేశపెట్టారు. మంగళవారం అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చించి ఆమోదించారు. దేశంలోనే మొదటి సారిగా అటవీ విద్య కోసం ఒక యూనివర్సిటీని నెలకొల్పటం చారిత్రాత్మకం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్
ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్

అడవుల రక్షణ, పచ్చదనం పెంపును తెలంగాణ ప్రభుత్వం మెుదటి నుంచి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2015 నుంచి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా హరితహారం కొనసాగుతోంది. మిగతా సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ అవుతోంది. హైదరాబాద్ సమీపంలో ములుగు వద్ద (సిద్దిపేట జిల్లా) అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతో పాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్ధంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

అటవీ విశ్వ విద్యాలయం ముఖ్యమైన అంశాలు

అటవీ విశ్వవిద్యాలయానికి శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. అటవీ విశ్వవిద్యాలయం (UoF), తెలంగాణ చట్టం 2022 దేశంలోనే మొట్టమొదటిది. ప్రపంచంలో మూడో అటవీ యూనివర్సిటీ అవుతుంది. రష్యా, చైనా తర్వాత మూడోది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల, పరిశోధన సంస్థని అటవీ విద్య, పరిశోధన, విస్తరణ, ఫలితాలను ప్రజలకు చేరువ చేయడం కోసం ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఫారెస్ట్ యూనివర్సిటీ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులోని ముఖ్యాంశాలు

అటవీ వనరుల సంరక్షణ, స్థిరమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన అటవీ నిపుణులను తయారు చేయడం ప్రాధాన్యంగా ఉంది. పరిశోధనలను ప్రోత్సహించడం, చెట్ల పెంపకానికి తగిన పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు మరియు ప్రజల అవసరాలు తీర్చనుంది యూనివర్సిటీ. వివిధ వ్యవసాయ-పర్యావరణ పరిస్థితులకు అనువైన వ్యవసాయ-అటవీ నమూనాలను అభివృద్ధి చేయనున్నారు. సంప్రదాయ అటవీ కార్యకలాపాలే కాకుండా, సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించడం, వ్యవసాయ వర్గాల ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిస్థితులను పెంపొందిస్తారు.

సారూప్య సంస్థలతో అనుబంధం, భాగస్వామ్యం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలా కృషి చేస్తుంది యూనివర్సిటీ. పరిశోధనా ఫలితాలను రైతులకు విస్తరణ శిక్షణ ద్వారా అందించడాన్ని ప్రోత్సహిస్తారు. అటవీ విశ్వ విద్యాలయం (UOF), తెలంగాణ స్థాపనతో అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన అటవీ నిపుణులను తయారు చేస్తుంది.

అటవీ కళాశాల, పరిశోధన సంస్థను యూనివర్సిటీగా రూపొందించిన తర్వాత అదనంగా పీహెచ్‌డీ (PhD) కోర్సులు, పట్టన అటవీ వనాలు, నర్సరీ మేనేజ్‌మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, క్లైమేట్ స్మార్ట్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ పార్క్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయించారు.

విద్యార్థుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 366 కు అదనంగా 360 పెరిగి 726 కి చేరుతుంది. ఉద్యోగుల సంఖ్య 118కు అదనంగా 92 పెరిగి 210 కి చేరుతుంది. సీఎం కేసీఆర్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉంటారు. ఛాన్సలర్.., వైస్ ఛాన్సలర్ ను నియమిస్తారు.

తెలంగాణా రాష్ట్రంలో హరిత వనాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణకు హరిత హారం" కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ యూనివర్సిటీ ద్వారా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

IPL_Entry_Point